ధమ్మపదం' లోని గాధలన్నీ బుద్ధుడు స్వయంగా చెప్పిన వాక్యాలు. 'ధమ్మ' అంటే బుద్ధుని బోధ అని, బౌద్ధ సంఘ నియమాలు, సిద్ధాంతాలు అని, ప్రకృతి నియమము అని కూడా అర్థాలు. 'ధమ్మ' అనే పాళీపదం, 'ధర్మం' అనే సంస్కృతపదం సమానార్ధకాలే అయినా బౌద్ధ సన్నివేశంలో 'ధమ్మ' అంటే బుద్ధ వచనం, బుద్ధ నియమం అన్నది రూఢి. దమ్మపదం అంటే బుద్ధుని బోధలకు మార్గం చూపే పదనులు అని ధర్మవచనములని తాత్పర్యం. కాని ఇందులోని ఉపదేశాలు ఒక్క బౌద్ధ మతానుయాయులకు మాత్రమే గాక సర్వజన సాధారణమయిన ఉపదేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో 423 పద్యాలు ఉన్నాయి. పండితులు వీటిని 26 వర్గాలుగా విభజించారు. ఇవన్నీ 'ఖుద్దకకాయం'లో రెండవ గ్రంథంగా పొందుపరచబడి ఉన్నాయి. 'ధమ్మపదం' ప్రపచంలోని అనేక భాషలలోకి అనువదింపబడింది. తెలుగులో కూడా దాదాపు 16 అనువాదాలు వచ్చాయని లెక్కవేశారు. |