ఊరువాడ బతుకు’ సజీవ నవలతో సాహిత్యలోకంలో స్థానం సంపాదించిన దేవులపల్లి కృష్ణమూర్తి బహుశా తెలంగాణ మాండలికంలో రాసిన తొలి యాత్రాచరిత్ర ‘మా యాత్ర’.
ఇది స్థూలంగా రెండు కాలాలలో నడిచే యాత్ర. ఒకటి 1960 ప్రాంతం నుంచి మొదలయ్యే గతం కాగా,  రెండోది 2011 నాటి వర్తమానం.ఈ గ్రంథంలో డెబ్బయ్యేళ్ళ రచయిత తన బాల్య యౌవనాలను సమీక్షించుకునే ప్రయత్నం చేస్తాడు.
ఇది ఒక రకంగా బతుకు తవ్వకం పని.
చిన్నప్పటి తన సహాధ్యాయి, కొన్నాళ్ళు కలిసి పనిచేసిన సహోద్యోగి, ఏదో ఒక ఘట్టంలో పరిచయమై మరి కనిపించకుండా పోయిన వ్యక్తి-వీళ్ళ వర్తమాన స్థితిగతులు కూడా రచయిత యాత్రలో పాలుపంచుకుని గ్రంథాన్ని జీవిత యాత్రగా మలుస్తాయి.
వీటన్నిటి మూలంగా ఈ పుస్తకానికి యాత్రా కోణంతో పాటు మానవీయ కోణం కూడా అమరడం విశేషం.
కాగా, నల్లగొండ జిల్లా నకిరేకల్లో మినీ బస్సులో ప్రారంభమైన రచయిత ‘యాత్ర’ బాసర, అజంతా, ఎల్లోర, అజ్మీర్ దర్గా, జైపూర్, ఢిల్లీ, కాశీ, కోలకతా, కోణార్క్ వంటి ప్రాంతాలను విశేషంగా దర్శించి కోస్తాంధ్ర మీదుగా తిరిగి నకిరేకల్ చేరుకొని భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తుంది.
బాసర గురించి చెప్తున్నప్పుడు కాశ్మీర్లోని వాగ్దేవి ఆలయ ప్రస్తావన వస్తుంది. ఎల్లోరాలో శిల్పకళలు అద్భుతం అనిపించే కైలాస నాథాలయం వివరాలు, అజంతాలోని పద్మపాణి చిత్రానికున్న అంతర్జాతీయ ఖ్యాతి ప్రస్తావనలు ఉంటాయి. తాజ్మహల్ నిర్మాణ విశేషాలు, ఢిల్లీ ఎర్రకోట ప్రాశస్త్యం కథనాలు కళ్ళకు కట్టినట్లుంటాయి. గంగానది ఒడ్డున ఉన్న పుణ్యక్షేవూతాల కథనం మరో ప్రత్యేక ఆకర్షణ.
అయితే, రచయిత 40, 50 సంవత్సరాల క్రితపు వ్యక్తుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం- అడిగిన వారిని, చెప్పేవారిని కూడా గతంలోకి ప్రయాణం చేయించే విధానం పాఠకుడిని కట్టి పడేస్తుంది.---- డా॥ అమ్మంగి వేణుగోపాల్

Write a review

Note: HTML is not translated!
Bad           Good