నీలమ్మ నాతో ఏడో క్లాస్ చదువుతోంది. చాలా మంచి అమ్మాయి. నేనంటే చాలా ఇష్టం. నా పక్కనే కూర్చునేది నాలుగో క్లాసు వరకు. అన్ని కాకి ఎంగిలి చేసి పెట్టేది జీడితో సహా. ఇప్పుడు ఏడో క్లాస్‌లో ఆడపిల్లల్ని వేరే వరుసలో కూర్చో పెడతారు... అయినా కూడా స్కూలు వదిలేసాక ఇంటికి కలిసే వెళ్లే వాళ్ళం అంకం నాని సోడా కొట్టుదాక. దారిలో పెద్ద గోపాలం గారి రైస్ మిల్లో కుండలో నీళ్ళు తాగి అక్కడ విడి పోయే వాళ్ళం. డొంకల్లో పుల్ల రేగి పళ్ళు కోసేటప్పుడు ముళ్ళు గుచ్చు కుంటాయని తనే కోసి నా జేబులు నింపేది. అలాగే బళ్ళో ఔట్ బెల్ కొట్టినప్పుడు సీతా ఫలం చెట్టెక్కి పిందెలు తాలైరే మొగ్గలు కోసి నాకు కూడా పెట్టేది. బండ పిల్ల... వాళ్ళమ్మ పొలంలో కూలి పని చేసి తనని చదివించేది. నేను స్కూల్లో ఆటల్లో అలసి పోతే నాకు నోట్స్ కూడా రాసిపెట్టేది. మంచి అమ్మాయి. కానీ ఏడో క్లాస్‌కి వచ్చే సరికి ఎందుకో గాని నాకంటే చాలా పెద్ద దానిగా కనపడేది. నేనింకా నిక్కర్లే. ఇంక ప్యాంట్లు కుట్టించుకోవాలి. అప్పుడు పెద్దోడిలా కనబడొచ్చు.
దారిలో ఎండకి దాహం వేస్తే ఎవరిదో చెరుకుతోట దగ్గర బోరింగ్ పైప్ అంచు మీద మూతి పెట్టి ఇద్దరం నీళ్లు తాగుతుంటే ఎలా తాగాలో చెబుతూ నా బుగ్గపై ముద్దెట్టింది.