2001 నుండి 2010 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో, సంకలనాల్లో, ప్రత్యేక సంచికల్లో, సంపుటాల్లో అచ్చయిన వేలాది తెలుగు వచన కవితలను సేకరించాం. వాటిలోంచి ఈ దశాబ్ది పరిణామాలకు దర్పణం పడుతున్న దాదాపు 200 ప్రాతినిధ్య కవితలనూ, ప్రాతినిధ్యకవులనూ గుర్తించాం. ఈ కవితలతో 'దశాబ్ది కవిత' పేరిట ఒక సంకలనంగా రూపొందించాం.
21వ శతాబ్దపు తొలి దశకం కవిత్వంనిండా అంతులేని ఆందోళన, అలజడి, అశాంతి, అల్లకల్లోలం, యుద్ధాలు, అవమానాలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహసనాలు, కరువులు, తుఫాన్లు, సునావిూ, ప్రకృతి విలయతాండవం, కులకక్షలు, మతమారణహోమాలు, గుజరాత్ గాయాలు, విద్యుత్ ఉద్యమాలు, భూ పోరాటాలు, ప్రభుత్వ పతనాలు, రాజ్యహింస, ఆంక్షలు, నిషేధాలు, శాంతి చర్చల మాటున కాటేసిన క్రౌర్యం, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, ప్రాణాలను బలిగొన్న పురుగుల మందులు, ఒంటరితనం, నిర్లిప్తత, నిర్వేదం, పంజాబ్ ఆక్రోశం, గుజరాత్ ఆక్రందన, ఇరాక్ విలాపం, ఆప్ఘన్ విధ్వంసం, లెబనాన్ సాహసం, ఇజ్రాయిల్ దాడులు, గ్లోబల్ గూండా వికటాట్టహాసం, అహంకారంపై విరుచుకుపడిన వైమానిక దాడులు, నియంత కళ్లల్లో వ్యక్తమైన భయం, దాడులు ప్రతిదాడులు, ఒక విషాద మానవ మారణహోమం, బాంబుల స్వైరవిహారం, మార్కెటీకరణ, పుత్రాగ్రహం, సౌందర్య రాహిత్యం, శ్మశానాలు, దాహాంద్రప్రదేశ్, ఋణాంధ్రప్రదేశ్, జై తెలంగాణా ఉక్కుపిడికిళ్ళు, ప్రజాగ్రహాలు, ఉద్వేగాలు, ఉద్యమాలు, ముదిగొండ మృత్యుఘోష, నందిగ్రామ భూ సమరం,.....వలసలు, నిట్టూర్పులు, పరిణామం, బాల్యానికి శిక్షణలేని వ్యవస్థ, యవ్వనానికి క్రమశిక్షణ లేని సమాజం, వృద్ధాప్యానికి రక్షణలేని దేవం, ..... కాలుష్యం కాటుకు బలవుతున్న పంచభూతాలు, శతక కవిత్వం లాంటి ఊరు, వారపత్రిక లాంటి నగరం, ప్రశ్నార్థకమవుతున్న త్యాగాలు, కోల్పోయిన వాటిని వెదుక్కోవడం, కోల్పోతున్న వాటిపట్ల ఆందోళన చెందడం, కోల్పోకుండా ఉండలేని అసహాయత. ఇదీ ఈ కవితల నిండా పరుచుకున్న జీవిత వాస్తవికత.
పేజీలు :440