''మృత్యువు నుంచి అమృతానికి సాగుదాం! మృత్యోర్మా అమృతం గమయ!!'' -ఉపనిషత్తు మాట.

ఇవ్వాళ మానవజాతి సాంతం మృత్యువులో ఉంది! ఈ విషయానికి హద్దులు, సరిహద్దులు వర్తించవు.

మానవజాతిని అమృతం వైపు మరలించడం నా ఈ నవల 'అమృతం గమయ' విధానం. 

నేటి మానవజాతి చీకట్లో తడుముకుంటున్నది! అశాంతితో అలమటిస్తున్నది! కాలుష్యంతో ఊపిరి ఆడకున్నది! ఆత్మహత్యలకు ఆరాటపడుతున్నది!

మానవుని ప్రధాన శత్రువు కాలుష్యం - టెర్రరిజం కానేకాదు! టెర్రరిజం రాజకీయానికి మాత్రమే శత్రువు! కాలుష్యం మానవజాతికి విషశత్రువు! రాజకీయానికి అర్థం, అధికారంతో మాత్రం నిమిత్తం.  అందుకు మానవుడు బలిపశువు!!!

నేను ప్రవృత్తి రచయితను - వృత్తి రచయితను కాను. మానవుడు నా ప్రధాన కేంద్రం.

సామాన్యుని గురించే నా వేదన - ఆవేదన - ఆవేశం!

ఒక అమృత సమాజాన్ని, ప్రశాంత జీవితాన్ని, ప్రకృతి అందాల వయారాలను చూశాను. సత్యం, శివం, సుందరం దర్శించాను! నా జీవితకాలంలో, నా కళ్ళముందే మానవుని పాతాళ పతనం చూస్తూనే ఉన్నాను. కేవలం సాక్షీభూతంగా జీవిస్తున్నాను.

నిజాం నిరంకుశత్వాన్ని - ప్రాణములొడ్డి ఆయుధం పట్టి ఎదిరించాను. ఇవ్వాళ ఇంతటి దారుణానికి కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నాను. అక్షర శిల్పిగా నా బాధ్యత నిర్వహించడానికి వెన్నెల సన్నాయి, చీకటి మరణమృదంగాలను కలం కుంచెతో చిత్రించిన సుదీర్ఘ అక్షర చిత్రమే 'అమృతంగమయ'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good