మానవ జాతి విజ్ఞానాభివృద్ధి క్రమాన్ని కీల మలుపుతిప్పిన గొప్ప గ్రంథం చార్లెస్‌ డార్విన్‌ రచించిన 'జాతుల ఆవిర్భావం'. నిజానికి డార్విన్‌ తన గ్రంథానికి పెట్టిన పూర్తి పేరు 'ప్రకృతి వరణం ద్వారా జాతుల ఆవిర్భావం' ( The  Origin of Species by Means of Natural Selection). ప్రకృతి వరణం (ఎంపిక) ద్వారా అనేది టాగ్‌. ఆ గ్రంథంలో డార్విన్‌ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం అప్పటివరకు జీవుల పుట్టుకకు సంబంధించి మానవుని ఆలోచనలను సమూలంగా మార్చేసింది. భూమ్మీద జీవ జాలాన్నంతటినీ, మానవునితో సహా దేవుడు సృష్టించాడనేది అప్పటివరకు ఉన్న అభిప్రాయం. ఈ అభిప్రాయంతో విభేధించే వారు లేరని కాదు. ప్రాచీన భారత దేశంలోనూ, గ్రీసులోనూ జీవజాలం పుట్టుకను భౌతికవాద దృష్టితో వివరించిన వారు అనేక మంది ఉన్నారు. చార్వాకులు దేవుని ఉనికిని పూర్తిగా తిరస్కరించారు. బౌద్ధులు పరిణామాన్ని పూర్తిగా భౌతిక వాద దృష్టితో ప్రతిపాదించారు. అనేక మంది గ్రీకు పండితులు ప్రకృతీ, దానిలోని జీవజాలం పదార్థం యొక్క పరిణామ క్రమంలో ఆవిర్భవించినవేనని చెప్పారు. అయితే వారంతా తత్వవేత్తలు. తమ వాదనలను తాత్వికంగా వివరించారే తప్ప రుజువులు చేయలేకపోయారు. రుజువు చేయడానికి నాడు సైన్స్‌ అంతగా అభివృద్ధి చెందలేదు.
ఏ దోపిడీ సమాజంలోనైనా పాలక వర్గాలు విస్తారమైన ప్రజానీకాన్ని మానసికంగా అణచిపెట్టడానికి వారికి దేవుని ఉనికి అవసరమైంది. దేవుడు, లేక అతీంద్రియ శక్తి మనిషినీ, ప్రకృతినీ సృష్టించి నడుపుతోందనే భావనను ప్రజల్లో ప్రచారం చేస్తేనే వారు తమపై సాగుతున్న అణచివేతను అంగీకరిస్తారు. ఈ ప్రయోజనం కోసమే మత గ్రంథాలు వెలిశాయి. ప్రకృతిలోని ప్రతి దృగ్విషయాన్ని గురించి నాటి మనిషి చెప్పుకున్న సమాధానాలను మత గ్రంథాలు నిక్షిప్తం చేశాయి. వానికి భిన్నంగా ఎవరైనా చెబితే తీవ్రమైన శిక్షలు పడేవి. యూరప్‌లో ఫ్యూడల్‌ యుగంలో చర్చి ఒక ఫ్యూడల్‌ ప్రభువులాగా వ్యవహరించింది. బైబిల్‌లో చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా చెబితే అది ప్రభు ధిక్కారంగా పరిగణించేవారు. శిక్షలు వేసేవారు.
కానీ ఫ్యూడల్‌ వ్యవస్థ గర్భంలో కొత్తగా ఆవిర్భవిస్తున్న బూర్జువావర్గ అభివృద్ధికి సైన్సు కావాల్సి వచ్చింది. అందువల్ల పరిశోథనలకు ఊతం లభించింది. కొత్త ఆవిష్కరణలు జరిగాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good