సాంఘిక దోపిడికీ అణచివేతకూ గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, నీచ వృత్తులుగా భావింపబడుతున్న వృత్తులు చేస్తున్నవారు, శారీరక శ్రమపై ఆధారపడి బతుకులు గడుపుతూ సమాజ సంపదను పెంచుతున్నవారు - ''దళితులు''.  దళితుల సంవేదనలను, ఆర్తినీ, ఆవేశాన్ని, నిరాశనూ, నిట్టూర్పులనూ, ఆగ్రహాన్నీ, యదార్థ జీవిత వ్యధార్త దృశ్యాలనూ ప్రతిబింబించేది దళిత సాహిత్యం.  దళితుల జీవిత వాస్తవికత ఎప్పట్నించి ఉందో, దళితుల భావ ప్రకటన కూడా అతి సహజంగానే, అప్పట్నించీ ఉంటుంది.  అంటే దళిత సాహిత్యం దళితుల జీవితమంత పాతది.  ఆర్యుల దండయాత్రలకంటే పూర్వం నుండి వైదిక సాహిత్య ఆవిర్భావానికి ముందునుండీ ఈ గడ్డ మీద పుట్టి పెరిగిన ఇక్కడి భూమి పుత్రుల, ఆది భారతీయుల సాహిత్య మూలాలను వెదికి, వెలుగులోకి తేవాల్సిన బాధ్యత దళిత రచయితల, చరిత్రకారుల, సామాజిక శాస్త్రవేత్తలపై ఉంది.  మౌఖిక సాహిత్య సంప్రదాయంలోనూ, శ్రామిక సాహిత్య  రూపాలలోనూ దాగి ఉన్న దళిత వాస్తవికతను దళితుల దృష్టి కోణం నుండి అన్వేషించి, ఆవిష్కరించాల్సిన అవసరం వుంది.
ఆధునికాంధ్ర కవిత్వంలో దళిత కవిత్వం దాదాపు ఒక శతాబ్ధ కాలంగా వెలువడుతున్నది.  జాతీయోద్యమ కాలంలో హరిజనాభ్యుదయ కవిత్వంగా వెలువడినదశ తొలిదశ కాగా, వామపక్ష ఉద్యమాలలో పీడిత వర్గ కవిత్వంగా వికసించడం రెండవ దశ, నేడు దళిత ఉద్యమాల స్ఫూర్తితో ఒక ప్రధానమైన సాహితీ స్రవంతిగా దూసుకురావడం వర్తమాన దశ.

Write a review

Note: HTML is not translated!
Bad           Good