పేదలకు పిడికిళ్ళు బిగించడం నేర్పిన ప్రణాళిక
– కొండూరి వీరయ్య

ఏ ప్రణాళికకైనా కొన్ని ముఖ్యమైన లక్షణాలుండాలి. అది కావ్యంలా పాఠకులకు హృద్యంగా ఉండాలి. మత్తేభం, శార్దూలమో, సీస పద్యం లాగానో కాక కంద పద్యంలాగా తేలిగ్గా ఉండాలి. చదువుతుంటే పాఠకుల మనసులో దాని భావనలు హత్తుకుపోయేదిగా ఉండాలి. చుట్టూ వేగంగా మారుతున్న పరిణామాలకు మూలకారణాలను విప్పి చెప్పేదిగా ఉండాలి. కళ్లముందు కనపడుతున్న వాస్తవాలను సదరు ప్రణాళిక చదివే వరకు గుర్తించలేకపోయామే అన్న భావన కలగాలి. మన ప్రమేయం లేకుండానే మన ముందు జరుగుతున్న పరిణామాల్లో మనము కూడా ఎలా భాగస్వాములమవుతున్నామో విడమర్చి చెప్పేదిగా ఉండాలి. చివరిగా నిర్వేదంలో కూరుకుపోయిన జనావళిని నిద్రలేపి మరో ప్రపంచం సృష్టికై కదిలించే శ్రీశ్రీ మహా ప్రస్తానంలా పాఠకుడిని కార్యోన్ముఖుడిని చేయాలి. అన్నింటినీ మించి నిత్యసత్యంగానూ, నిత్యనూతనంగానూ ప్రపంచాన్ని చూసేందుకు కళ్లజోడులా పని చేయాలి. 1848 ఫిబ్రవరి 21న లండన్లోని లివర్‌పూల్ లో విడుదలైన కమ్యూనిస్టు ప్రణాళిక పైన చెప్పిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచ దశని, దిశని మార్చేసిన రాజకీయ రచనల్లో కమ్యూనిస్టు ప్రణాళికకు దీటైన గ్రంధం మరోటి లేదు. యూరప్ ను ఓ భూతం ఆవహించింది అన్న తొలి వాక్యమే ప్రపంచంలో జరగబోయే పరిణామాల గురించిన హెచ్చరికగా ఉంటుంది.
 సమాధానం తెలిసిన తర్వాత కూడా చెప్పాలా వద్దా అన్న సందేహంతో కొట్టమిట్టాడుతూ భేతాళుడిని భుజాన మోస్తున్న విక్రమార్కుడిలా పాఠకుడు కూడా ఇంతటి దారుణమైన దాష్టీకమైన దోపిడీ వ్యవస్థను మనుగడ కొసాగంచటంలో నేను కూడా భాగస్వామిగా ఉండాలా, చరిత్ర నాపై మోపిన మోయలేని భారం కింద నలిగి పోవాలా లేక సాయుధుడినై చరిత్రను తిరగరాయాలా అన్న మీమాంస కమ్యూనిస్టు ప్రణాళిక చదువుతున్నప్పుడు పాఠకుడికి కలుగుతుంది.

కమ్యూనిస్టు ప్రణాళిక తొలి పాఠకుడికి అంటే 1848 నాటి యూరోపియన్ పాఠకుడికి మేధోమధన సమాచారం కాదు. తక్షణ కార్యాచరణకై పెట్టిన పొలికేక. భూస్వామ్య వ్యవస్థ గర్భం నుండి అప్పుడే పుట్టటానికి పురిటి నొప్పులు పడుతున్న బూర్జువా వ్యవస్థ తనను తాను నిలదొక్కుకోవటానికి కార్మికవర్గాన్ని పావులుగా మార్చుకుంటున్న వేళ ఆ మోసాన్ని కళ్లకు కట్టినట్టు విప్పి చెప్పి కార్మికుడిని బూర్జువా వర్గంపై తిరుగుబాటుకు కార్యోన్ముఖుడిని చేసిన వ్యూహ రచన కమ్యూనిస్టు ప్రణాళిక. నేటి యువత ముందు కూడా అదే పరిస్థితి ఉంది. కాలంతో పాటు కమ్యూనిస్టు పార్టీల్లోనూ ఉత్థాన పతనాలున్నాయి.

కానీ కమ్యూనిస్టు పార్టీలకు మార్గదర్శనం చేయాల్సిన ప్రణాళిక మాత్రం శిలాశాసనంగా మిగిలే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తు అంధకారంగా మారుతోందని గుర్తించిన కోట్లాదిమంది యువకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కమ్యూనిస్టు ప్రణాళిక వెలుగులు ప్రసరిస్తూనే ఉంది.

గొప్ప భవిష్యత్తును ఊహించటం, దానికోసం వ్యూహరచన చేసుకోవటమే గొప్ప దార్శనికత కాదు. ఈ వ్యూహరచనను ఆచరణ సాధ్యం చేయటం, భావి తరాల మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేయటం వ్యూహరచన దార్శనికత గొప్పతనాన్ని, అమరత్వాన్ని తెలియచేస్తుంది. విముక్తి పోరాటాలకు, విప్లవోద్యమాలకు వెలుగు దివ్వెగా నిలిచిన కమ్యూనిస్టు ప్రణాళిక అటువంటి అమరత్వాన్ని సాధించింది. అందుకే రెండో శతజయంతికి చేరువవుతున్నా ఈ గ్రంధం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో స్ఫూర్తిదాయనిగా వెలుగుతూనే ఉంది. తొలి అడుగులు వేయటానికి కూడా నాడు కష్టపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీ, దాష్టీకం, లాభాపేక్షతో సాగించే యుద్ధ కాంక్ష, వలసలు, ప్రపంచీకరణ, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని లాభార్జన కోసం పెట్టుబడి పాదాక్రాంతం చేసుకుంటున్న తీరును కమ్యూనిస్టు ప్రణాళిక రెండు శతాబ్దాల క్రితమే అక్షర సత్యంగా గుర్తించిందంటే ప్రణాళిక ప్రపంచీకరణ గురించి, హద్దుల్లేని పెట్టుబడి చలనం గురించి 1848లోనే మార్క్స్ ఏంగెల్స్ హెచ్చరించారు. దాంతో పాటు వచ్చే ముప్పును కూడా మన ముందుంచారు.

కమ్యూనిస్టు ప్రణాళికను నేడు చదువుతున్న వారెవరైనా నాడు మార్క్స్ ఏంగెల్స్ లు వర్ణించిన పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు, నేడు నిత్య జీవితంలో 21వ శతాబ్దంలో చూస్తున్న లక్షణాలకు మధ్య చెప్పుకోదగ్గ తేడా లేకపోవటాన్ని ఇట్టే గుర్తిస్తారు. కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పినట్లు ” నిరంతరం తమను తాము అభివృద్ధి చేసుకుంటూ ఆధునిక దశకు చేరుకుంటున్న ఉత్పత్తి సాధనాలు.”ఈ ఉత్పత్తి సాధనాలే “ఉత్పత్తి సబంధాలను నిరంతరం విప్లవాత్మకంగా మారుస్తూ అన్ని సామాజిక పరిస్థితులను పెకలించి వేస్తున్నాయి. అంతులేని ఆందోళనకు పునాదులేస్తున్నాయి.”

 సాంకేతిక పరిజ్ఞానం ప్రభావం సమాజంపై ఎలా ఉంటుందో చర్చిస్తూ కమ్యూనిస్టు ప్రణాళిక ” అంతిమంగా మనిషి తానేమిటో తన జీవన పరిస్థితులు ఏమిటో, వాటితో తనకున్న సంబంధం ఏమిటో తెలుసుకుంటాడు..” అని ప్రకటిస్తోంది. మనకున్న తప్పుడు అభిప్రాయాలను దూదిపింజల్లా ఎగరగొడుతూ సాంకేతిక పరిజ్ఞానం మానవ సంబంధాల్లో దిగజారుడుతనాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరింపచేస్తోంది. నేడు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా లక్షలాది మంది గొంతెత్తుతున్నారు.  ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ” సమాజం స్థూలంగా రెండు శతృ శిబిరాలుగా చీలిపోతుంది. ఈ శిబిరాలు ఒకదానితో ఒకటి తలపడటానికి సన్నద్ధమవుతుంటాయి.” అన్న కమ్యూనిస్టు ప్రణాళిక వాక్యాలు కళ్ల ముందు కదిలాదక మానవు. ప్రపంచ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఉన్న శతకోటీశ్వరుల వద్ద ప్రపంచంలోని 90 శాతం సంపద పోగుపడ్డా ప్రపంచంలోని 99 శాతం జనాభాను పాలించే సామర్థ్యాన్ని కోల్పోతారని మార్క్స్ చేసిన హెచ్చరికను గుర్తు చేసుకునే సమయం ఇది. ఇప్పటి వరకు జరిగిన చరిత్ర యావత్తూ వర్గ పోరాటాల చరిత్రే అని నిర్ధారిస్తోంది. ఇలా కమ్యూనిస్టు ప్రణాళికలో ఉన్న ప్రతి అంశం నేటి వాస్తవాలకు కూడా ప్రతిబింబాలే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good