కాలేజీ చదువులయ్యాక కొన్ని నవలలు రాశాను.
అడపాదడపా పాఠకుల నుంచి ఉత్తరాలు వస్తుండేవి.
కొందరు పాఠకులు, ''మీరు డాక్టరై వుండీ ఎంతసేపూ పల్లెటూరి జీవితాలను గురించే రాస్తారెందుకు? నగర జీవితం గురించి ఒక నవల రాయండి'' అని రాసేవారు.
ఒకసారి శ్రీమధురాంతకం రాజారాం గారు కూడా, ''అవునబ్బా, నువు నాణెం రెండు వైపులా చూసినోడివి. సిటీలైఫ్ గురించి నువ్వు రాయాల'' అన్నారు. (ఇంతకీ నేను నాణెం రెండువైపులా చూసినోడినేనా?)

నాకు బాగా తెలిసన నగరం పాండిచ్చేరి నగరమే. ఆ నగరంలో ఎవర్ని గురించి రాయాలి? బాగా పరిచయమున్న విషయం గురించి మాత్రమే రాయాలన్న చాదస్తప్రాయమైన నియమం కలవాడిని. కనుక ఒక మెడికో అనుభవాలను ఆధారంగా చేసుకుని రాయాలనుకున్నాను. నా ఇతర నవలలలాగే సంఘటనలన్నీ స్వల్ప వ్యవధిలో - మూడు, నాలుగురోజులలో - జరిగిపోయేలా ప్లాటు వేసుకుని ఈ నవల రాశాను.
ఈ సమాజంలో ఏర్పరచుకున్న బూటకపు విలువలను, బోడి సంప్రదాయాలను ఆమోదించలేని ఒక ఉలిపికట్టె కథే ఇది.
- డా.కేశవరెడ్డి
ఇందులో అద్భుత కథనం వుంది.
దేవీదాస్ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా ... మతాల వారీగా ... కులా వారీగా ... జెండర్ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ 'దొడ్డు' వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.
కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా ... ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి.
జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ''సిటీ బ్యూటిఫుల్''.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్ వన్.--------- కాశీభట్ల వేణుగోపాల్

Write a review

Note: HTML is not translated!
Bad           Good