సరిగ్గా 33 ఏళ్ల్ల క్రితం (నవంబర్, 1978) 'గాన్ విత్ ద విండ్' నవలని మాలతీ చందూర్ (స్వాతి మాసపత్రికలో) పరిచయం చేసినప్పుడు పాఠకులంతా అబ్బురపడి,

'ఇంత గొప్ప నవలని ఎవరైనా తెలుగులోకి పూర్తిగా తీసుకొస్తే బాగుండేది కదా' అని మధనపడ్డారు.

వాళ్ల బాధని అర్థం చేసుకున్నట్టుగా మూడు దశాబ్దాల తర్వాత పూర్తి అనువాదంతో తెలుగు పాఠకుల ముందుకు తీసుకొచ్చారు ఎం.వి.రమణారెడ్డి.

ప్రపంచ ప్రఖ్యామైన వంద నవలల్ని ఎంపిక చేస్తే అందులో తొలి పది నవలల్లో 'గాన్ విత్ ద విండ్' ఉంటుందన్న అనువాదకుడి మాటతో పాఠకులు పూర్తిగా ఏకీభవిస్తారు.

అయితే ఈ నవల చదవడానికి ముందు కొంత అమెరికా చరిత్ర, 1861 నుండి 1865 మధ్య కాలంలో అక్కడ జరిగిన సివిల్ వార్ గురించి తెలిసివుంటే మరింత ఆసక్తిగా చదివిస్తుంది.

యూరోపియన్లు అమెరికాను ఆక్రమించి స్థానిక 'రెడ్ ఇండియన్స్'ని తరిమేసి వందలాది ఎకరాల్ని ఆక్రమించి, పత్తి పండించే భూకామందులుగా చలామణి అయ్యారు. ఆ క్రమంలో ఆఫ్రికా ఖండం నుండి లక్షలాది నల్లజాతీయుల్ని బానిసలుగా తీసుకెళ్లి వారితో ఊడిగం చేయించుకున్న చరిత్ర ప్రపంచానికి తెలిసిందే.

బానిసత్వ నిర్మూలన పోరాటాల నేపథ్యంలో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ నీగ్రోలకి పూర్తి స్వేచ్ఛనివ్వడం అమెరికా దక్షిణాది రాష్ట్రాలకు నచ్చలేదు.

అవి యునైటెడ్ స్టేట్స్తో విడిపోయి 'కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్'గా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆ తిరుగుబాటుని అణిచివేసి, దేశాన్ని ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో సాగిందే అమెరికా అంతర్యుద్ధం.

1900 సంవత్సరంలో పుట్టిన 'మార్గరెట్ మిచ్చెల్' తన 25-35 ఏళ్ల మధ్యకాలంలో ఈ నవల రాశారు. 65 ఏళ్ల క్రితం జరిగిన అంతర్యుద్ధ చరిత్రని శోధించి, మధించి ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారు.
'గాన్ విత్ ద విండ్' నవల 1939లో సినిమాగా విడుదలై పది ఆస్కార్ అవార్డులు సాధించడం గమనార్హం. ముఖ్యంగా స్కార్లెట్ పాత్రతో ఆస్కార్ స్వంతం చేసుకున్న నటి వివియన్ లీహ్ ఇండియాలోని డార్జీలింగ్లో పుట్టి ఊటీలో బాల్యం
గడపడం ఆసక్తి కలిగించే విషయం.---------- - గొరుసు

Write a review

Note: HTML is not translated!
Bad           Good