సాహితీమిత్రులారా! 1910లో తెలుగుకథ పుట్టింది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పడింది. వందేళ్ళ ఈ సందర్భం పురస్కరించుకొని తెలుగు భాషోద్యమ సమితి మిత్రులు బలంగా అనుకొన్నాము - చిత్తూరు జిల్లా రచయితలు రాసిన 'చిత్తూరు కథ' తీసుకురావాలని, తీరా రెండేళ్ళ కాలం పట్టింది ఈ సంకలనం తేవడానికి.
'చిత్తూరు కథ'లో న్యాయంగా అయితే అచ్చంగా చిత్తూరు జిల్లా సంస్కృతిని ప్రతిఫలించే, చిత్తూరు జిల్లా ప్రజల భాష తొణికిసలాడే కథలే ఉండాలి. అప్పుడే 'స్థానికత' పేరుతో వచ్చే కథా సంకలనాలకు విలువ, సార్థకత!
సంగటి ముద్ద, ఘుమ ఘుమలాడే వూరుబిండి, మునగాకు పొరుటు అచ్చంగా చిత్తూరు జిల్లా తిండి యిది. ఈ తిండి మీకు పెడతామని చెప్పి, పాలిష్ బియ్యంతో ఫ్రైడ్ రైస్ వొండి, నాన్ - పన్నీర్ బట్టర్, కాలీఫ్లవర్ ఆయిల్ రోస్ట్‌తో విందు పెడితే యీ ఆహారం కూడా భలేగా వుండొచ్చు గానీ అదయితే ఈ జిల్లా వంటకం గాదు.
ఈ కథలు కూర్చడంలో యీ సమస్యే తలెత్తింది. కేవలం చిత్తూరు జిల్లా జనజీవనాన్ని ప్రతిఫలించే కథలే వేయాలా, చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగి రచయితలైన వారి కథలు వేయాలా అని తర్జన భర్జన పడి, చివరికి కొంచెం 'విశాల దృక్పథం'తో కథల్ని స్వీకరించాము. ఈ పరిస్థితి పరిగణనలోకి తీసుకునే యీ పుస్తకాన్ని స్వాగతించండి. మా చిత్తూరు జిల్లా రచయితలు, రచయిత్రులు పలురకాలుగా చిత్రిక పట్టిన పలు కోణాలను ఈ కథలలో చూడవచ్చు అని సవినయంగా యీ సంకలనాన్ని సమర్పిస్తున్నాము. కథారచయితలకూ, సంపాదకత్వ బాధ్యత స్వీకరించిన మా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ పేరూరు బాలసుబ్రహ్మణ్యానికీ కృతజ్ఞతలు.
- సాకం నాగరాజ

Write a review

Note: HTML is not translated!
Bad           Good