"చే జీవితం యువతకు ఉత్తేజం!

భావితరాలకు ఉజ్వల భవితను నిర్మించడం కోసం నిండు జీవితాన్ని సమిధను చేసి ఆర్పించేవారు చరిత్ర నిర్మాతలై చిరస్ధాయిగా నిలుస్తారు. నేటి యువత సరికొత్త ఫ్యాషన్‌ సింబల్‌గా టీ షర్లుపై దర్శనమిస్తున్న చే గువేరా అలాంటి ఆదర్శజీవి. గుండెలపై గువేరాను మోస్తున్న యువతలో ఎక్కువ మంది ఆ విషయాన్ని ఎరగక పోవడం కనీస వ్యవహారికి జ్ఞానాన్ని ఇవ్వలేని నేటి విద్యావిధానపు వైఫల్యానికి కొండంత రుజువు. చే జీవితంలోకి తొంగి చూసినవారెవరైనా...ఆయనను గుండెలపైనే కాదు, గుండెలలోనూ దాచుకోకుండా ఉండలేరు. జీవితం విలువను ఎరిగినవాడు కాబట్టే చే తన గుండె నెత్తురుతో పీడిత జనవిముక్తి మార్గాన్ని వెలిగించార. 1928 జూన్‌ 14న అర్జెంటీనాలోని రాసారియా పట్టణంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎర్నెస్టో చే గువేరా విప్లవకారుడు మాత్రమే కాదు, చింతనాపరుడు కూడా. వైద్య విద్య కోసం 1948లో బ్యూనస్‌ ఎయిరిన్‌ విశ్వవిద్యాలయంలో చేరిన చే ''ప్రపంచాన్ని శోధించాలనే ఆకలి''ని భరించలేక వైద్య విద్యను పక్కనబెట్టి, మోటార్‌ సైకిల్‌ ఎక్కాడు. 1950లో ఉత్తర అర్జెంటీనాలోని గ్రామసీమలను చుట్టేస్తూ 4,500 కిలోమీటర్లు ప్రయాణించినా ఆ 'ఆకలి' తీరలేదు. 1951లో మళ్ళీ మోటార్‌ సైకిలెక్కి 9 నెలలపాటు అర్జెంటీనా, చిలీ, పెరూ, ఈక్వడార్‌, కొలంబియా, వెనిజులా, పనామాలతో పాటు అమెరికాలోని మియామీ, ఫ్లోరిడాలను సందర్శించాడు. మూడోసారి సుదీర్ఘ ప్రయాణం 1967లో బొలీవియాలో ముగిసింది. మెక్సికోలో క్యూబా విప్లవ నేత ఫిడెల్‌ క్యాస్ట్రోకు సన్నిహిత మిత్రునిగా, కామ్రేడ్‌గా మారాడు. క్యాస్ట్రోతో కలిసి 1956లో క్యూబా చేరాడు. గెరిల్లా యోధునిగా మొక్కవోని సాహసం చూపాడు. క్యూబా విప్లవంలో క్యాస్ట్రో తర్వాత రెండో నేతగా ఎదిగాడు. 1959లో క్యూబా విప్లవ విజయానంతరం చే ప్రభుత్వంలో కీలక బాధ్యతలను నిర్వహించాడు. 1959లో భారత్‌ పర్యటించినప్పుడు సైతం చే నిజాన్ని సూటిగా చెప్పడానికి వెనుకాడలేదు. ''150 ఏళ్ళ సామ్రాజ్యవాద పాలనకు తెరపడింది. కానీ భారత్‌లో ఇంకా పేదరికం తాండవమాడుతూనే ఉంది. ఎక్కువ భూమి కొద్దిమంది చేతుల్లో ఉండటమే దీనికి కారణం. సామాజిక న్యాయం సాధించాల్సిన లక్ష్యం ఇంకా మిగిలే ఉంది.'' 1965లో అల్జీరియాలో చివరిసారిగా చే బహిరంగంగా కనిపించాడు. చే తిరిగి క్యూబాకు వెళ్ళలేదు. అప్పటికే తన 'వీడ్కోలు లేఖ'ను రాశాడు. ప్రపంచ విప్లవాన్ని విజయవంతం చేయడానికే తన జీవితాన్ని అర్పిస్తున్నానని స్పష్టం చేశాడు. బొలీవియాలో విప్లవీయాలో విప్లవకార్యకలాపాలు ప్రారంభించాడు. సిఐఏ సమారారంతో 1967 అక్టోబర్‌ 8న బొలీవీయా సేనలు భారీ ఎత్తున తరలి చే మకాంను చుట్టుముట్టి దాడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ చేగువేరాను బంధించాయి. ఇంటరాగేట్‌ చేయడానికి వచ్చిన అధికారులపై ఉమ్మి సత్కరించిన ఆయనను అక్టోబర్‌ 9న కాల్చి చంపేశారు. అక్టోబర్‌ 18న క్యూబా రాజధాని హవానాలో పది లక్షల మంది క్యూబన్లు చేకు నివాళులర్పించారు. మున్నెన్నటికన్నా నేడు యువత చేగువేరా జీవితాన్ని, ఆచరణను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చే మార్గాన్ని స్వీకరించి అసమనాతలు లేని భవితను నిర్మించాల్సి ఉంది. అదే చేగువేరాకు అర్పించగల నిజమైన నివాళి!- అనంతోజు మోహన్‌"

Write a review

Note: HTML is not translated!
Bad           Good