మానవులు సమానవులుగా బతకగలిగే శ్రమైకజీవనసౌందర్య 'మరోప్రపంచం'కోసం కలలుగన్నాడు శ్రీశ్రీ. అందుకు విప్లవమే శరణ్యమన్నాడు. 'యాడుందిరా విప్లవం అడనే కూడుందిరా నీ గూడుందిరా' అన్నాడు శ్రీశ్రీ. దేశంకోసం దేహాలను ప్రాణాలను రణప్రాయంగా తృణప్రాయంగా విడిచిన ఎందరో వీరవిప్లవయోధులను స్మరించాడు, సంస్మరించాడు. వారి విప్లవపోరాట చైతన్యస్ఫూర్తిని తెలుగు లోకానికందించాడు. తెలుగు సాహిత్యాన్ని వెలిగించాడు.

    'వ్యక్తిపూజను మనం ఎంత నిరసించినా వీరపూజను మాత్రం మానలేం. స్టాలిన్‌ వీరాధివీరుడు అతని సంస్మరణ మనకు అవశ్యం అగత్యం' అంటూ స్టాలిన్‌ను వీరారాధిస్తూనే వ్యక్తి పూజకు వీరపూజకు తేడా వివరించాడు.

    'తెల్లవాడు నిన్ను నాడు భగత్‌సింగ్‌ అన్నాడు / నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు/ ఎల్లవారు నిన్ను రేపు వేగుజుక్క అంటారు / అల్లూరికి వారసుడా? శ్రీశ్రీ కవిత్వలాలసుడా! ఊగరా ఊగరా/ నువ్వూగుతుంటే శత్రువులకి గాభరా' ... అంటూ విప్లవవీరుడ్ని కీర్తిస్తూ 'పది మందిని చంపేవాడికి గాని పదిమందికోసం ప్రాణిలిచ్చే నీకు చావన్నది లేనే లేదురా' అని తేల్చిచెప్పేడు. 'ఈనాడు అన్ని భాషా నిఘంటువులలోకి ఒక కొత్తమాట ప్రవేశించింది. - నక్సలైట్‌.పదిమంది, వందమంది, వెయ్యిమందిని ఈ పేరు పెట్టి చంపినా, ఈ మాటనుమాత్రం ఎవరూ తుడిచి పెట్టలేరు' అంటూ నిక్సనైటు (చీకటి)ను చీల్చేది నక్సలైటు (వెలుతురు)గా అభివర్ణించాడు. భూమి, భుక్తి, విముక్తి పోరాట యోధులను శ్లాఘించాడు, వివ్లేషించాడు, విశేషించి గ్లోరిఫై చేశాడు.

    ఇది మరొక అగ్నికణం. ఇది లాటిన్‌ అమెరికా విప్లవకారుడు. గన్నూ పెన్నూ ధరించి దేశంకోసం దేహాన్ని విడిచిన గెరిల్లా విప్లవయోధుడు డాక్టరు ఎర్నెస్ట్‌ చేగువేరా గురించి వీరారాధకుడు శ్రీశ్రీ చేసిన అరుణారుణ వీరారాధన పుస్తకం ఇది. ఇది శ్రీశ్రీ ఎరుపు అక్షరాల శతఘ్ని.

Write a review

Note: HTML is not translated!
Bad           Good