అన్ని రకాల అధ్యయానాలలోకీ చరిత్ర అధ్యయనానికొక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది కావడానికి గతాన్ని గురించి చేసే అధ్యయనమేగానీ ప్రేరణ వర్తమానం నుండి, భవిష్యత్తు నుండి వస్తుంది. వర్తమానాన్నీ, భవిష్యత్తునూ మనం ఏ రకంగా ప్రభావితం చేయదలచుకున్నామన్న దాన్ని బట్టి గతంవైపు చూసే మన దృష్టికోణం ఉంటుంది. దానికి తగిన విలువలనూ, చారిత్రక ఆధారాలనూ, ఆదర్శాలనూ చరిత్రలో మనం వెతుక్కుంటాము. ఆ కోణం నుండి చరిత్రను వ్యాఖ్యానించుకుంటాం. నిజాయితీగా వ్యవహరించదలుచుకుంటే ఏ భవిష్యత్తు ప్రయోజనాల కోసం మనం గతాన్ని అధ్యయనం చేస్తున్నామో ప్రకటించుకోవాలి.

    దానితోపాటు అధ్యయన సంబంధమైన నిజాయితీ కూడా ఉండాలి. మన దృష్టి కోణానికి (అది ఎంత గొప్పదయినా కానియ్యండి) పనికొచ్చే విషయాలనేకాక దానిని అబద్దం చేయగల విషయాలను కూడా చూడాలి, విశ్లేషించాలి, అవసరమైతే ఆ వెలుగులో మన దృక్కోణాన్ని పునర్వ్యాఖ్యానించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాక మనతో విభేదించే దృక్కోణాలను వక్రీకరించడమో తొక్కిపెట్టడమో కాకుండా సంవాదం ద్వారా వాటిని ఎదుర్కోవాలి. సంఘ్‌పరివార్‌ తిరగ రాయదలచుకున్న చారిత్రక దృక్పథం విలువలు అమానవీయమైనవి. ప్రజాస్వామిక దృక్పథానికి అవాంఛనీయమైన భవిష్యత్‌ లక్ష్యం నుండి పుట్టినవి. అంతేకాక వారి అధ్యయన పద్ధతిలో శాస్త్రీయమైన నిజాయితీ శూన్యం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good