చాగంటి సోమయాజులు (చాసో) (1915-1994) మానవ జీవితాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించి, కళాత్మకంగా కథ చెప్పడం చాసో విశిష్టత. మార్క్సిస్టు తత్వాన్ని జీర్ణించుకొన్న జీవన దార్శనికుడు చాసో. తాను పుట్టి పెరిగిన విజయనగర ప్రాంత ప్రజల జీవితాన్ని మాండలికంలో వ్యక్తం జేసి కథకి కావ్య గౌరవాన్ని కలిగించిన సృజనకారుడు చాసో.
బాల్యం, హేతువాదం, మానవత, స్త్రీ పురుష సంబంధాలు, వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, విద్య ఆవశ్యకత- ఆయన కథల్లో పాఠకుల్ని ఆలోచింప చేస్తాయి. చిత్ర లేఖనం, సంగీతం వంటి లలిత కళల్లో ఆయనకు గల అభినివేశం కథలని 'క్లాసిక్స్‌'గా తీర్చిదిద్దే నైపుణ్యాన్ని వికసింపజేసింది. తెలుగు ప్రాంతపు జీవితాన్ని చిత్రించి ప్రపంచ మానవ స్వభావాన్ని ఆవిష్కరించిన తనదైన, అరుదైన కథన శిల్పం చాసోది. కథలో రచయిత కనిపించకుండా పూవు వికసించినంత సహజంగా కథ చెప్పడం చాసోకి చేతనవును, తెలుగు భాష సొగసు చాసో కథలకి సహజ అలంకారం. కాలాన్ని జయించిన కథా సృజన ఆయన విశిష్టత.
చాసో అభ్యుదయ రచయితల సంఘం వ్యవస్ధాపకులలో ఒకరు. భౌతికవాది. కళిగాంద్రా నుండి గురజాడ వారసత్వాన్ని అందుకొని భావితరాలకు స్ఫూర్తినిచ్చిన చాసో భారతీయ సాహిత్య నిర్మాతలలో ప్రముఖులు, మార్గదర్శకులు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good