ఈ నవలలో భూస్వామ్య, ధనస్వామ్య వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహించే పాత్రల మధ్య భావాల మధ్య ఘర్షణను కుటుంబరావు అత్యంత తీవ్రరూపంలో చిత్రించలేదు. ఎందుకంటే మధ్యతరగతిలో ఆ ఘర్షణ సాధారణంగా అత్యంత తీవ్ర రూపంలో ఉండదు. అత్యంత తీవ్రరూపంలో లేకపోయినా సామాజిక ఆ ఘర్షణ వాస్తవికంగానూ, విశ్వసనీయంగానూ పాఠకులకు అనుభూతం చెయ్యడానికి పాత్రల సామాజిక సంబంధాలనూ, ప్రవర్తనలోని సంకీర్ణతనూ, మార్పునూ కుటుంబరావు చిత్రించారు.
సుందరం పెళ్ళి సందర్భంలోగానీ, సుందరం మేనమామ శేషగిరి కుమార్తె పెళ్ళి సందర్భంలోగానీ, శేషగిరి తమ గ్రామంలోని స్వరాజ్యం బడిలో అస్పృశ్యులను చేర్చుకోవాలన్నప్పుడుగానీ తీవ్రమైన ఘర్షణ మనకు కనిపించదు. సుందరం కట్నంతో బాల్యవివాహం చేసుకుంటాడు. మేనమామ శేషగిరి కూతురికి బాల్యవివాహం చేశాడు. 'కాకులు పొడిచినట్టు పొడుస్తుంటే ఏం చెయ్యను? చెబితే వినరాయె. ఈ బాల్యవివాహాలూ, దిక్కుమాలిన ఆచారాలూ మానలేక పోతే మనకు స్వరాజ్యం ఎందుకంట! ఛీ! ఛీ! మన గతి ఇంతే. గాంధీ మహాత్ముడింత ఉద్యమం నడపటమేమిటి? ఈ పేడ సుద్దలు ఉన్న చోట ఉంటామనటం ఏమిటి?'' అని వాపోతూ మార్పు కోసం కృషి చేసే శక్తి గుర్తించి కూడా కూతురికి బాల్యవివాహం చేస్తాడు. జాతీయ పాఠశాలలో అస్పృస్యుల పిల్లల్ని చేర్చుకుందామన్నందుకు వెలివేసినంత పనిచేస్తే రాజీపడిపోతాడు.