రాజకీయాలూ - సాహిత్యం రెంటినీ నిర్వహించిన వ్యక్తులు భారతదేశంలో చాలామందే కనిపిస్తారు. తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వ్యక్తులను గుర్తించగలం. అయితే రెండురంగాలలోనూ గర్వింపదగిన ప్రముఖులుగా చాలా కొద్ది మందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు గారలు యావద్భారతం గుర్తుంచుకోదగ్గ నిష్ణాతులు.

బూర్గుల రామకృష్ణారావు - సాహితీ ప్రముఖులందరిలాగానే కవిత్వ రచనతో రంగప్రవేశం చేశారు. రాజకీయరంగాన గణనకెక్కిన వ్యక్తిగా అప్పటికే రాణకెక్కారు. తెలుగు - సంస్కృతం - ఉర్దూ - పారశీ - ఆంగ్ల భాషల్లో ప్రావిణ్యం సంపాదించటమే కాదు, ఆయా రంగాల్లోని ప్రసిద్దులు మెచ్చుకోగల కవిత్వ రచన చేసిన ఖ్యాతీ వీరికే దక్కింది.

    రాజకీయ రంగం విషయం పక్కనపెట్టి, సాహితీ రంగంలో వీరు చేసిన కృషిని ఈ తరంవారికి తెలియచేయటమే ఈ సంకలిత రచనల వెనకఉన్న ఉద్దేశం. వీరి రచనలు సుమారు మూడు సంకలనాలుగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బూర్గులవారి 'కవిత్వం, వ్యాసాలు, పీఠికలు' సేకరించి ఈ మొదటి సంకలనంగా వెలువరించారు. - ఏటుకూరి ప్రసాద్‌, సంపాదకులు, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌.

Write a review

Note: HTML is not translated!
Bad           Good