'ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది' అంటాడు మిల్టన్. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గించడానికి అది ఒక మంచి సాధనమైంది.
బాలసాహిత్యంలో గేయ ప్రధానమైన రచనలకు అత్యంత ప్రాధాన్యముంది. పుట్టినప్పటి నుంచి ఇవి పిల్లలకు ఉపకరిస్తాయి. తల్లులు పాడే జోలపాటలు, లాలి పాటలు, చందమామ పాటలు ఈ కోవకు చెందినవే. పాటలు శ్రవ్య సాహిత్యానికి సంబంధించినవి. కథలు కూడా ఇందులో భాగాలే అయినా వాటిని అర్థం చేసుకోవడానికి కొంత వయసు రావాలి. కానీ పాటలలా కాదు. వీటికి తాళం, లయ, గతి, ప్రాస మొదలైన నియమాలుండడం వల్ల, నాదాన్ని ఆశ్రయించడం వల్ల శ్రవణప్రియంగా ఉంటాయి. పిల్లలకు తొందరగా పట్టుబడతాయి. ప్రాచీన బాల సాహిత్యం ఎక్కువగా గేయరూపంలో ఉండడానికి కారణమిదే. గేయాల్లోని భావం వాళ్లకు అర్థం కాకున్నా వాటిలోని లయ వాళ్ల వెంటనడుస్తుంది. నాదం పరవశింపజేస్తుంది. అందుకే 'శిశుర్వేత్తి పశుర్వేతి వేత్తిగాన రస పణి:' అన్నాడు.
'బుజ్జోని కల' గేయ సంపుటిలోని గేయాలన్నీ ఐదారేండ్ల వయసు పిల్లల్ని ఉద్దేశించి రాసినవి. పిల్లల్లోకి పరకాయ ప్రవేశం చేసి రాసినవి. అందుకే సహజంగా గోచరిస్తున్నాయి. వీటిలో వస్తువైవిధ్యముంది. చిన్న పిల్లల అందచందాలకు, ముద్దుముచ్చట్లకు, చిలిపి చేష్టలకు, చిత్త ప్రవృత్తులకు శాస్త్రి ఈ పాటల ద్వారా ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. వీటిలో ఆసక్తికరమైన పిల్లల ఆటల్ని చూడొచ్చు. తేనెలొలికే ముద్దు మాటల్ని వినొచ్చు. నిర్మలమైన వాళ్ల మనసుల్ని చదవొచ్చు. - ఆచార్య ఎం.కె.దేవకి