బుడుగు ! చిచ్చులపిడుగు
ఈ బొమ్మ నేను.
నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. మా బామ్మ హారి పిడుగా అంటుంది. అందుకు, ఇంకో అస్సలు పేరుంది. ఇప్పుడు చెప్పడానికి టైములేదు. అది చాలా పొడుగు. కావాలిస్తే మా నాన్నని అడుగు.
అదిగో మా నాన్న. మా నాన్నకి నేను కొడుకు. మా నాన్న నాకు గొడుగు. ఇలా అని కొత్త ప్రైవేటు మేష్టరు చెప్పాడు. వీడు మంచివాడు కాడు. అంటే చెడ్డవాడు. అసలు వీడే కాడు. ఈ ప్రైవేటు మాష్టర్లు అందరూ అంతే. చిన్నపిల్లలకి చదువు చెప్పడంరాదు. పైగా సొంటిపిక్కలు తీస్తావంటారు. ఈడుకి తగని లెక్కలు చెయ్యమంటారు.
ఆ లెక్కలు చూసి బామ్మ కూడా అమ్మ బాబోయ్‌ అనేసింది (బామ్మకి అ ఆ లు కూడా బాగా రావుట). అంటే నేం మళ్ళీ మేష్టరొస్తే రండి బాబూ అని చాపేస్తుంది.
అలుసు అంటే ఇదే. (ఈమాట బామ్మ చెప్పింది). ఈ మాష్టరు అలుసు తీసుకున్నాడు. తీసుకుని నన్ను తిడుతున్నాడు. నేనేం చిన్నవాడినా లేకపోతే చితకవాడినా ! (నాన్న సిగరెట్లు చాలా కాలిస్తే బామ్మ చిన్నవాడివా చితకవాడివా అంటుందిలే).
ఇప్పుడిప్పుడే ఏడో ఏడు నాకు. ఏడాదినుంచీ ఈ మేష్టర్లు నా కోసం వస్తున్నారు, ఒకటి తరవాత ఒకడు వీడు పదోవాడు కాబోలు, అందరూ నన్ను దబాయించడమే. ముందర చాక్‌లెట్లు తెస్తారు. ఒక్కరూ పకోడీలు తేరు. పైగా ఆ చాక్‌లెట్లు ఇచ్చినందుకు లెక్కలు చేసిపెట్టమంటాడు. వాడు పది ఇస్తే (ఉత్తది ఒకటో రెండో తెస్తాడు). నేను రెండు తింటే.... ఎన్ని వుంటాయి అంటాడు. నేను ఏదో చెప్పినా, రెండు రోజులయ్యాకా, తిట్టుతాడు. నేను చిన్నవాడినా లేకపోతే చితకవాడినా. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good