నిజానికి పాఠకుడికి, కథ ముఖ్యంగాని, దాని వెనక ప్రేరణ శక్తులేవో, అది ఎందుకు ఎట్లా వ్రాయవల్సివచ్చిందో తెలుసుకోడం ముఖ్యం కాదు.  తీరా చదివాక ఆ కథ నచ్చకపోతే, ఈ కథనం అంతా బడాయిగా కనబడి మరింత చికాకు పడొచ్చు.  కథ నచ్చినట్లయితే మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తే దాన్ని గురించిన వృత్తాంతం తెలుసుకోవాలనుకోడంలో ఆక్షేపణ వుండదనుకుంటాను.  పాఠకుడికి కావల్సింది ఈ కథ కళానుగుణంగా తృప్తికరమైందా? ఇది సాహిత్యమా? అన్న ప్రశ్నలు.  ఈ కథలు తృప్తికరంగా లేకపోతే, అందుకు కొంత బాధ్యత రసెల్‌పై వెయ్యవద్దని కోరుతున్నాను.  నేను మొదట్లో చెప్పినట్లు నన్ను కొన్నాళ్ళుగా కలవరపెట్టిన కొన్ని భావాలు, రసెల్‌ వ్యాసంలో తటస్థపడ్డాయి - మందుగుండు సామాగ్రి సిద్ధంచేస్తే నిప్పుపుల్ల వేసినట్లు నిప్పుపుల్ల గీసినా ఆ మందు కాలకపోతే మందు తయారీలో లోపంకాని, అగ్గిపుల్లదికాదు.  అగ్గిపుల్లకూడా కాలకపోతే, పాఠకుడు ఎంత నిరాశ చెందుతాడో ఊహించగలను.  అట్లా నిరాశ చెందకుండా వుండేటందుకు ఈ రెండు మాటలూ తోడ్పడితే తృప్తి పడతాడు. - బుచ్చిబాబు

Write a review

Note: HTML is not translated!
Bad           Good