బుచ్చిబాబు కథలు

తెలుగు కథా సాహిత్యంలో బుచ్చిబాబు అనగానే - 'సౌందర్యాన్వేషి' అనే ఒక విలక్షణమైన 'ముద్ర' వినిపిస్తుంది.  అది ఆయనకే ప్రత్యేకమై వెలసి అనితర లభ్యంగా నిలిచి వెలుగుతోంది! ఇదీ ఆయన కీర్తికిరీటంలోని కలికితురాయి.

'కథానిక అనేది మళ్ళీ మళ్ళీ చదివించే ఖండకావ్యంగా ఉండాలి' అన్నాడు.  అలాగే 'నూతనమైన వస్తువు దొరకదు.  ప్రతి విషయం గురించి పెద్దలిదివరకు రాస్తూనే ఉన్నారు.  చెప్పే తీరులో, శిల్పంలో విశిష్టత కనబరచాలి, అన్నాడు.  ఈ కారణాలవల్లనే బుచ్చిబాబు మానవ మనస్తత్వం ఆధారమైన కథా వస్తువులతో అపూర్వమైన విస్తృతిని సాధించాడు.

ఒక కథలో చెప్పిన అంశం మరో కథలో చెప్పకుండా, ఒక కథలో విశ్లేషించిన మనస్తత్వ కోణాన్ని మరో కథలో విశ్లేషించకుండా భిన్న స్వరాల ఇతివృత్తాల్ని అందించారు బుచ్చిబాబు.

రచన ద్వారా జీవితంపై ఒక దృక్పథం కలుగజెయ్యాలనే నిబద్ధత వున్న కథకుడు - బుచ్చిబాబు.  నిజమైన కళ ప్రచారం చెయ్యదు.  జీవితాన్ని చిత్రిస్తుంది.  ఆ చిత్రణ ద్వారా ఒక రసానుభూతిని కలిగిస్తుంది. ఒక జీవిత సత్యాన్ని పాఠకుడిలో ఉద్దీపింపచేస్తుంది.  ఆ చిత్రణా, రసానుభూతీ, ఆ జీవిత సత్యం - సమాజ శ్రేయస్సుకు, పరోక్షంగా ఉపకరిస్తాయి.  ఇదీ సామాజిక ప్రయోజనం.  ఇదీ బుచ్చిబాబు తత్త్వం.  ఆయన కథల అంతస్సారం!

ఒక చిన్న సంఘటనో, సన్నివేశమో ఆధారం చేసుకుని - జీవితమంత విశాలమైన మనిషి అంతరంగంలోని ఒక పార్శ్వాన్ని - ఎంత శక్తిమంతమైన కథగా మలచవచ్చునో నిరూపిస్తాయి బుచ్చిబాబు కథలు!

సూక్ష్మమైన ఇతివృత్తానికి స్పష్టమైన, క్లుప్తమైన రూపకల్పన జరుగుతుంది ఆయన కథల్లో.  అందుకే అవి గొప్ప కథలు

Write a review

Note: HTML is not translated!
Bad           Good