ఐదారు దశాబ్దాల క్రితం వచ్చిన నవలల గురించి వర్తమానంలో చర్చించి, వ్యాఖ్యానించడం అంటే చరిత్రతో సంభాషించడం! ఈ సంభాషణలో గతంలో పాదుకొని ఉన్న కొన్ని ఉన్నత విలువలు ఈనాడు ఎక్కడా వినబడడం లేదు. మీదు మిక్కిలి ఆనాడు సమాజంలో ఉన్న అవలక్షణాలు - ఇన్నాళ్ళ ప్రజాస్వామిక పాలన తర్వాత కూడా అంతకన్నా ఎక్కువగా వేళ్ళూనుకు పోయాయి. ఇది జాతి ప్రయాణిస్తున్న తిరోగమన దశను సూచిస్తుంది. ఈ తిరోగమనానికి అనేక కారణాలు ఉన్నాయి. విలువలు నశించడం ఒక కారణం. నాశనం చేయడమే విలువలుగా చలామణి అవుతున్న కాలంలో మనం ఉన్నాము. ఇట్లాంటి సందర్భంలో చారిత్రక విషయాలపై అవగాహన రాహిత్యంతో చేసే వ్యాఖ్యలు తప్పుడు సంకేతాలనిస్తాయి. నిజానికి ఒక సంఘటన జరుగుతున్న కాలంలో వాటిని చూసి అనుభవించి వాఖ్యానిస్తే వాటిపై ఉద్వేగాల ప్రభావం
ఉంటుంది. అందువల్ల రచయితకు ఆనాడు ఉన్న అభిప్రాయం భవిష్యత్తులో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఘటన వాడి-వేడిలో రూపుదిద్దుకునే అభిప్రాయం. ఆ తర్వాతి కాలంలో పరిశోధనలు, భిన్న పార్శ్వాల నుంచి వ్యక్తుల వ్యాఖ్యానాల మూలంగానూ, స్వయంగా వ్యక్తి జ్ఞానం, ఆలోచనలలో వచ్చే మార్పు మూలంగానూ మార్చుకునే అవకాశముంది.
ఉదాహరణకు ఒక వ్యక్తి అత్యాచారానికి తెగబడితే, అది తెలిసిన మరుక్షణం అతడిని దోషిగా నిర్ధారించి ఉరి తీయాలని సమాజం డిమాండ్‌ చేస్తుంది. అయితే అదే అంశాన్ని కొద్ది కాలం తర్వాత నింపాదిగా ఆలోచిస్తే 'ఉరి' అనేది అమానుషమని, అతన్ని వేరే విధంగా శిక్షిస్తే చాలు అనే అభిప్రాయం ఏర్పడుతుంది.
సరిగ్గా ఇవే విషయాలు శ్రీ భాస్కరభట్ల కృష్ణారావు రచనలు - 1లోని నవలలు 'యుగసంధి', 'వెల్లువలో పూచిక పుల్లలు' నవలలకు కూడా వర్తిస్తాయి. ఇక్కడ గతకాలపు సంఘటన లేదా సంఘటనలను వర్తమానకాలంలో విశ్లేషించడమంటే వాస్తవాన్ని వాస్తవాలుగా వెలుగులోకి తేవడమే. ఈ వాస్తవాలు, ఉద్వేగాలు, జీవన్మరణ సంఘర్షణలు, ఉద్యమాలు అన్నీ కలగలిపి పైన సూచించిన నవలలుగా రూపుదిద్దుకున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good