అంబేద్కర్ మార్క్సిజానికి, కమ్యూనిజానికి వ్యతిరేకం అని భావించడం ఒక అపోహ. మార్క్సిజంతో అంబేద్కర్ సంబంధం అంత తేలిగ్గా అంతుచిక్కనిది. ఆయన తనను సోషలిస్టు అని నిర్వచించుకున్నాడు కాని మార్క్సస్టు అని చెప్పుకోలేదు. కాని మార్క్సిజం శక్తి సామర్థ్యాలతో ఆయన ఎంతో ప్రభావితం అయ్యారు. అయితే కొన్ని మార్క్సిస్టు సైద్ధాంతిక సూత్రీకరణల పట్ల ఆయనకు తీవ్రమైన మినహాయింపులున్నాయన్నది వాస్తవం. దళితుల్లో స్వార్థపర శక్తులు మాత్రం అంబేద్కర్ను మార్క్సిజానికి గట్టి వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నాయి. అందుచేత అంబేద్కర్ మానవసమాజాన్ని చూసిన మౌలిక ప్రాతిపదిక అయిన వర్గం అనేది నిషిద్ధమైనదిగా మిగిలిపోయింది. కమ్యూనిస్టులు తమ వైపు నుండి అంబేద్కర్ పైన ఆయన భావాలపైన దాడి చేశారు. 1950ల ఆరంభంలో అంబేద్కర్ 'భారతదేశము-కమ్యూనిజము' అనే పుస్తకం రాయడం మొదలు పెట్టారు. కాని అది పూర్తి కాలేదు. ఆ రచన తాలూకు ఇప్పుడు లభిస్తున్న భాగాలను, మరో అసంపూర్తి రచన 'నేను హిందువును కాగలనా?' భాగాలను కూర్చుచేసినది ఈ ప్రచురణ. విభజనకు ఇరువైపుల ఉన్న వారూ తప్పక చదవాల్సినది ఈ పుస్తకం. ఇరువురి కళ్ళూ తెరిపిస్తుంది.
పేజీలు : 144