శ్రీరామదాసు కల్పిత పాత్ర కాదు. దాదాపు 350 ఏళ్ల క్రితం ఈ తెలుగు నేల మీద మన మధ్య నడయాడిన ఓ మహనీయ వాగ్గేయకారుడతడు. ఒక గొప్ప వ్యక్తి చుట్టూ, అతని మహిమ పెంచడానికి అతిశయోక్తులల్లడం; అవి ప్రచారంలోకి తేవడం సహజంగా జరిగే ప్రక్రియ! నేనూ అలా చేస్తే చరిత్రకు ద్రోహం చేసినవాడినే అవుతాను. అదే జరిగితే ఈ రామదాసు చరిత్ర మరో తప్పుల తడక అవుతుంది. అలాగని ప్రచారంలో ఉన్నవన్నీ అతిశయోక్తులని కొట్టి పారేస్తే, రామదాసు గాథలో చెప్పడానికేమీ మిగలదు.
ఈ సంకట పరిస్థితి నుంచి నన్ను నేను ఉద్దరించుకోవడానికి ముందు, గత ముందు 400 సంవత్సరాల దక్కన్ (దక్షిణ) పాలకుల చరిత్రను క్షుణ్ణంగా చదవలసి వచ్చింది.
'దక్కన్లోని కుతుబ్షాహి రాజుల పాలనాకాలం దీనిలో అంతస్సూత్రంగా సాగుతూ వస్తుంది. ఈ కుతుబ్షాహి వంశీయులు నిజంగానే తెలుగు వారిని అపారంగా ఆదరించారు. చరిత్ర నిండా అందుకు సంబంధించిన ఉదాహరణలు కోకొల్లలు. సందర్భానుసారంగా వాటిని అక్కడక్కడ దీనిలో ప్రస్తావించడం జరిగింది.
రామదాసు జీవితంలో ముఖ్యఘటనలుగా చెప్పబడుతూన్న తారక మంత్రోపదేశం, అతని పుత్రుడు గంజిగుంటలో పడటం, తానాషాకు రామలక్ష్మణులు మారువేషాల్లో వచ్చి అప్పు తీర్చడం వంటివి చారిత్రక దృక్పథంతో చూస్తే కొన్ని అవాస్తవిక అంశాలుగా, అతిశయోక్తులుగా కన్పించడం సహజం! కనుక - ఈ ఘటనల్ని చర్చించేటపుడు, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే వాస్తవిక చరిత్ర శోధకుడు చేయదగినది. కనుకనే ఈ రచన 'సమన్వయ మార్గం'లో సాగింది.