ధర్మానంద కోశాంబి .... గోవా దగ్గరిలోని సంఖావల్‌ అనే పల్లెటూరులో 1876 అక్టోబరు 9న జన్మించారు. ఆ ఊరిలో చదువుకొనే సౌకర్యాలు లేక కొద్దిగా సంస్క ృతం, మరాఠీ మాత్రమే అభ్యసించారు. చిన్నతనంలోనే ఒక మరాఠీ మాసపత్రికలో వచ్చిన బుద్ధభగవానుని జీవితచరిత్రను చదివి ప్రభావితుడయ్యారు. మహాపండితులైన భండార్కర్‌ దగ్గర సంస్కృతాన్ని నేర్చుకొని శ్రీలంక వెళ్ళి, మహాస్థవిర సుమంగళాచార్య వద్ద బౌద్ధ భిక్షువుగా మారి, పాళీభాషలో ఉన్న బౌద్ధ వాఙ్మయాన్ని అధ్యయనం చేసి, అక్కడినుండి బర్మా వెళ్ళి, విపశ్యనా ధ్యానాన్ని అభ్యసించి, భారతదేశం తిరిగి వచ్చారు. వీరు కలకత్తా, పూనా, బొంబాయి విశ్వవిద్యాలయాలలో పాళీ భాషాచార్యులుగా పనిచేశారు. అంతేకాక అమెరికా, రష్యాలో ఉన్న విశ్వవిద్యాలయాలలో కూడా ఆచార్యులుగా పనిచేశారు. హరదయాళ్‌ ప్రభావంతో సామ్యవాదం వైపుకు మొగ్గారు. జైనంపట్ల కూడా ఆకర్షితులయ్యారు. బౌద్ధ, జైనాలపై ఆణిముత్యాలవంటి ఎన్నో గ్రంథాలు రచించారు. బౌద్ధాన్ని తిరిగి పునరుద్ధరీకరించిన తొలితరంలోని ఒకరిద్దరిలో ధర్మానంద కోశాంబి అగ్రగణ్యులు. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ బౌద్ధం వైపుకు ఆకర్షింపబడటానికి ప్రేరణ కోశాంబిగారే. ఆయన తన చివరిరోజులలో వార్ధాఆశ్రమంలో చేరి నిరాహార వ్రతం పూని బుద్ధపూర్ణమనాడు నిర్యాణం పొందాలని ప్రయత్నించారు. ఆ తరువాత కొద్దిరోజులకే 1947 జూన్‌ 5న తనువు చాలించారు. వీరి రచనలలో మణి మకుటం భగవాన్‌ బుద్ధ. ఈ గ్రంథం దాదాపుగా అన్నీ భారతీయ భాషలలోకి అనువాదం పొందింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good