బౌద్ధమతం' అంటారు. 'బుద్ధదేవుడు' అంటారు. బుద్ధునిది మతం ఎలా అయిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఎప్పటికీ అర్ధం కాదు కూడా. ఎందుకంటే, ఎప్పుడూ, ఎక్కడా, బుద్ధుడు 'మత' ప్రస్తావన చేయలేదు. సమాజంలోని అసమానతలు, కులవిభేదాలు సిద్ధార్ధుని మనసు నొప్పించాయి. 'అధర్మం' సహించలేక ధర్మఘోష చేశాడు. ఆయన తలకెత్తుకుంది మానవధర్మం. ఆయన పరితపించింది దు:ఖనివారణకు, 'ఆనందం' అందరికీ పంచడానికి. మనిషికి, మనసుకు మూడు ఆవరణలుంటాయి. ప్రధానమైంది బుద్ధి, ఆ తర్వాతది స్వధర్మం. తర్వాతది సంఘం. ఒకటి భౌతిక జీవన వలయం. రెండవది వివేకం, నీతి కలగలిసిన ధార్మిక జీవనం. మూడు జ్ఞానం, అధ్యాత్మికతకు నీడనిచ్చే సంఘ జీవనం. ఈ మూడు కలిస్తేనే మానవ జీవితానికి పూర్ణత్వం.

భగవంతుడు 'లేడు' అనడానికి కారణం భగవంతునికి ఒక రూపం అంటూ లేదు కనక. అన్ని భగవత్‌ రూపాలూ మన: కల్పితాలే. భగవంతుడు 'అరూపం' అయినా అది చైతన్యం. విశ్వవ్యాప్తమైన చైతన్యమే భగవంతుడు, దైవత్వం. ఆ చైతన్యాన్ని, దివ్యతత్వాన్ని మనిషి పరిధిలోకి తీసుకు వచ్చే ఏకైక సాధన ధ్యానం. మన మహాత్ములు, మహర్షులు, అవతార పురుషులు అందరూ బోధించేది అదే జ్ఞానం. కాలాన్ని బట్టి, దేశాల్ని బట్టి, మతాల్ని బట్టి అంతరాలు కనిపిస్తాయి. 'సత్యం' ఒకటే అయినప్పుడు ఇన్ని మతాలెందుకు? అసలు మతాలు ఎందుకు సంకుల సమరాలెందుకు? బుద్ధునికి ఎదురైన ప్రశ్న అది. దానికి దీటైన సమాధానమే గౌతమబుద్ధుని జీవితం.

కుల మత నిర్మూలనకు జీవితాన్ని 'కర్పూరహారతి' చేసినవాడు బుద్ధుడు. మనిషి కన్నీటి బరువును తూకం వేసి, బాధలగాధలు పరిశోధించి, ప్రతి మనిషికీ 'ఆనంద' మార్గం చూపినవాడు బుద్ధుడు. మతాలకు అతీతమైనది 'మానవత్వం' అని నిర్మోహంగా చాటిచెప్పినవాడు బుద్ధుడు. మానవతకు మతం నీడ అవసరంలేదని. కులం ఆసరా అసలు అవసరంలేదని నిరూపించినవాడు బుద్ధుడు.

జ్ఞానబుద్ధుని సందేశాల సమాహారమే శ్రీ శార్వరి గారు వెలువరించిన 'భగవాన్‌ బుద్ధ'.

Write a review

Note: HTML is not translated!
Bad           Good