కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై వున్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దు:ఖిస్తూ కూచున్నాడు. ఆయనకు నిద్రాహారలు లేవు. తన కొడుకులూ, బంధువులూ - అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదేపనిగా కుమిలిపోతున్నాడు.

అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు.

''మహారాజా! ఇప్పుడు దిగులుపడి ఏం లాభం? మహాయుద్ధం జరగబోతున్నది. విపరీతంగా జననష్టం సంభవించనున్నది. చూడు! ఎటు చూసినా అపశకునాలు కనిపిస్తున్నాయి. నీవారే కాదు, భూమిమీద అసంఖ్యాకంగా రాజులు, వీరులు ఈ యుద్ధంలో హతమైపోతున్నారు. ఇది దైవనిర్ణయం'' అన్నాడు వ్యాసుడు, ధృతరాష్ట్రుడితో.

అది విని ధృతరాష్ట్రుడు ''మహాత్మా! అయితే నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటారు?-'' అని దీనంగా అడిగాడు.

అందుకు వ్యాసమహర్షి ''మహారాజా! చేతనైతే ఇప్పుడైనా నీ కుమాళ్ళకు ధర్మం చెప్పు. యుద్ధం ఆపి, న్యాయంగా నడుచుకోమని వారికి బోధించు. అలా చేస్తే నీకూ, నీ వంశానికి ఎక్కడలేని కీర్తి వస్తుంది. నీ వాళ్ళంతా సుఖంగా వుంటారు. ప్రజలూ సుఖపడతారు'' - అని చెప్పాడు.

మహర్షి మాటలు విని గ్రుడ్డిరాజు కంట తడిపెట్టాడు. ''మునీంద్రా! నీకు తెలియనిది ఏమున్నది కనుక నేను చెప్పడానికి? నా కొడుకులు నా వశంలో లేరు. ఏం చేసేది? కుమాళ్ళకు బుద్ధి చెప్పలేదని నామీద నింద వేయకు మహర్షీ! నేను అన్ని విధాలా అశక్తుడ్ని. అందుకే ఏమీ చెయ్యలేక ఇలా అఘోరిస్తూ కూచున్నాను'' అని తన అసహాయతనూ, అసమర్థతనూ వ్యక్తం చేశాడు.

అప్పుడు వ్యాసమహర్షి ''రాజా! ఇప్పుడు ఎవరు ఎంత విచారించినా లాభంలేదు. సమయం మించిపోయింది. జరగాల్సింది జరిగి తీరుతుంది. దాన్ని ఎవరూ ఆపలేరు. తప్పు నీదైనా, నీ కొడుకులదైనా ధర్మానికి జయం, అధర్మానికి అపజయం తప్పదు. నేను చేయగలిగిందల్లా ఒక్కటే! ఈ భారత యుద్ధగాథను నేనొక చరిత్రగా రచించి లోకానికి వెల్లడిస్తాను. కౌరవ, పాండవుల కీర్తి భూమిమీద శాశ్వతంగా ఉండేలా చేస్తాను'' అని చెప్పాడు.

ఈ మాటలు విన్న తరువాత ధృతరాష్ట్రుడికి కొంత మనశ్శాంతి కలిగింది. అంతట వ్యాసుడు మళ్ళీ ''మహారాజా! నీవు ఈ యుద్ధాన్ని కళ్ళారా చూడదలిస్తే, నీకు దృష్టి ప్రసాదిస్తాను'' అని అన్నాడు.

పుట్టుకతోనే గ్రుడ్డివాడైనా ధృతరాష్ట్రుడికి తిరిగి కళ్ళు ఇవ్వగల దివ్యశక్తి వ్యాసమహర్షికి వున్నది. ఆ విషయం గ్రుడ్డిరాజుకు తెలుసు. కాని, ఇది ఆయనకు ఇష్టం లేదు.

''మహాత్మా! నీకు సర్వశక్తి సంపన్నుడవు. లోకం అంతా చీకటిగా ఉన్న నాకు నీవు చూపు నివ్వగలవు. అయితే, నా కొడుకుల చావు నేను కళ్ళారా చూడలేను. ఘోరమైన యుద్ధ దృశ్యాలను చూచి భరించలేను. నన్ను ఇలాగే వుండనివ్వు'' అని బదులు చెప్పాడు. ఒక్కక్షణం ఆగి మళ్ళీ ''మహర్షీ! నీకు సమ్మతమైతే ఒకటి మాత్రం అనుగ్రహించు. యుద్ధంలో సంగతులన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలిసేటట్లు చెయ్యి'' - అని ప్రార్థించాడు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good