బెంగుళూరు నాగరత్నమ్మ ఒక దేవదాసి.
ఓ అసాధారణ స్త్రీమూర్తి.
ఇది ఆమె జీవిత చరిత్ర.

సంగీత సాహిత్య సామాజిక రంగాలలో ఆమె చూపిన ప్రతిభ, తెగువ విలక్షణమైనవి.
ఆమె సంగీత పండితుల నుంచి కూడా గౌరవాన్ని పొందిన విద్వాంసురాలు.
తన జీవితాన్ని త్యాగరాజ సంప్రదాయానికి అంకితం చేసిన విదుషీమణి.

ముద్దుపళని ''రాధికా సాంత్వనము''ను ప్రచురించి వీరేశలింగం పంతులువంటి ఉద్దండులను ఎదుర్కొంది.
ముళ్ల తుప్పల మధ్య అనాదరంగా పడివున్న త్యాగరాజ సమాధిని చూసి చలించిపోయి తిరువయ్యూరుకు కొత్త శోభను తీసుకొచ్చింది.
దేవదాసీ హక్కుల కోసం ధైర్యంగా పోరాడింది.

దేవదాసీగా పుట్టిన నాగరత్నమ్మ (1878-1952) చిన్నతనంలోనే సంగీత సాహిత్య నృత్య కళల్లో ఎంతో నైపుణ్యం సాధించింది.

వాగ్గేయ కారుడు త్యాగరాజు సమాధి చుట్టూ మండపం కట్టించడంలో ఆమె పాత్ర చిరకాలం నిలిచిపోతుంది.
రెండు వేరువేరు వర్గాల వారు త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించడమే గానీ మండపం గురించి పట్టించుకున్న పాపాన పోలేదు.
అప్పుడు నాగరత్నమ్మ జోక్యం చేసుకుని, మండపం కోసం తన ఆస్తినంతా ధారపోసింది.
ఆమె కృషి వల్లనే త్యాగరాజు సమాధి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దాని బాగోగులు చూసేందుకు తన జీవిత చరమాంకంలో తిరువయ్యూరులోనే వుండిపోయింది.
అయినా ఆమె త్యాగరాజ ఆలయంలో దాసిగానే మిగిలిపోయింది.
త్యాగరాజు సమాధికి ఎదురుగా చేతులు జోడించి కూర్చున్న భంగిమలో ఆమె విగ్రహం వుంది.
ఇంతకంటే ఆమె కూడా ఏమీ కోరుకుని వుండదు....

స్త్రీవాదిగా నాగరత్నమ్మ జీవితం దేవదాసీల పట్ల మనకుండే అపోహలను పటాపంచలు చేస్తుంది.
వారిని లైంగిక జీవులుగా, అనైతిక ప్రాణులుగా హీనంగా చూసే మన సమాజ ధోరణి ఎండగడుతూ... వారిని కూడా మనలో ఒకరిగా చూసే కొత్త చూపును మన కందిస్తుంది.

ఈ మహత్తర జీవిత చరిత్రకు అంతటి ప్రాశస్త్యం వుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good