హిందూ బ్రాహ్మణీయ భావజాలంలో, తాత్విక దృక్పథంలో సహజంగా ఇమిడిపోయిన ఈ నిరంతర విభజన. అంతరాలు, ఆధిక్యత, అస్పృశ్యత, మడి, యధాస్థితిని సమర్ధించే కర్మ సిద్ధాంతం భారతీయ సమాజంలో రక్త మజ్ఞాస్థిగతమై పోయాయి. అవి సమాజ జీవితంలో ఎంతగా సంలీనం అయ్యాయంటే, ఆ నిచ్చెనలో అట్టడుగున ఉన్న మెట్టుకూడ తన కింద మరొక మెట్టు ఉండాలని కోరుకుంటుంది. ఉందని అనుకుంటుంది. ఆ కిందిమెట్టు కన్న తాను అధికురాలిననీ, దానితో తాను అస్పృశ్యత పాటించాలనీ, పాటించవచ్చుననీ భావిస్తుంది. సహచర మానవ సమూహాలతో అంతర్వివాహ, సహపంక్తి భోజన సంప్రదాయం లేకపోవడమే తమ సమూహపు ప్రత్యేకతగా ప్రతి సమూహమూ భావిస్తుంది. అందువల్ల అట్టడుగున అంచులలో ఉన్న సమూహాల మధ్య కూడ ఐక్యత గాని, ఏకశిలా సదృశ సంఘీభావం గాని సాధ్యం కావడంలేదు. ఆ అంచులలోనే మరెన్నో అంచులు, అక్కడా విభజనలు, అక్కడా నిచ్చెనమెట్లు, అక్కడా దూరాలు విస్తరించాయి.

ఒకటి రెండు శతాబ్దాలుగా ఆయా వర్గాల నుంచి పుట్టుకువచ్చిన రచయితల వల్ల, వారితో సహానుభూతి ప్రదర్శించే ప్రగతిశీల భావధోరణులవల్ల, సామాజిక శాస్త్ర పరిశోధనలవల్ల ఆయా అంచుల జీవితం కొంతయినా బయట పడుతున్నది. కాని బయటపడని అపారజీవితంతో పోలిస్తే బయట పడుతున్నది చాల తక్కువ. అందులోనూ ఆ అంచులలో కూడ కొన్ని సమూహాల గురించి వచ్చిన దానితో పోలిస్తే ఇంకా సమాచారం బయటికి రాని సమూహాలు ఎన్నో ఉన్నాయి. సమాచారం ఎంతో ఉంది. అటువంటి అనేకానేక అవ్యక్త అలిఖిత అంచుల జీవితాలలోంచి ఒక వర్గాన్ని ఎంచుకుని బయటిగుడిసెలు రూపంలో దానికి అక్షరరూపం ఇచ్చిన శ్రీ దేవులపల్లి కృష్ణమూర్తి గారి కృషి ప్రశంస నీయమైంది. ఆ కృషిని మన సమాజపు నిర్దిష్టతతో, వాస్తవికంగా చేసినందుకు రచయితకు అభినందనలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good