ఒక కొత్త కథని చదవటమంటే ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేసుకున్నట్టేనని ఒక సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావుగారు అన్నారు. దీన్ని ఇంకాస్తా పొడిగించుకుని కొత్త జీవన సందర్భాల్ని, సన్నివేశాల్ని పరిచయం చేసుకోవడంగా కూడా చెప్పుకోవచ్చు. రావుకృష్ణారావుగారి కథలు అలాంటి అనుభవాన్ని ఇస్తాయి. ఆయన కథలు పాఠకులకు కొత్త ద్వారాలు తెరుస్తాయి.

ఈ వ్యవస్థలో బతకాలంటే ఏటికి ఎదురీదటం అనివార్యం. ఈ వాస్తవాన్ని కృష్ణారావుగారు బలంగా చెప్పారు. తన కథల్లో మనని నడిపించే శక్తుల గురించి సూచ్యప్రాయంగా తెలియజేశారు. విభిన్నవర్గాల ప్రజలు వివిధ రూపాల్లో దోపిడీ పీడనలకి గురవుతున్న వైనాన్ని చూపారు. అదే సమయాన తమ అవసరాలే ప్రధానంగా తలపోస్తూ ఇతరుల పట్ల అమానవీయంగా వ్యవహరించడానికి ఏమాత్రం సిగ్గుపడని మనుషుల ధోరణిని కూడా చిత్రించారాయన. శ్రమ పట్ల ఏహ్యభావాన్ని పెంచుకునే సామాజిక వర్గాల ద్వంద్వ ప్రవృత్తిని నిరసించారు. వ్యవస్ధని విమర్శిస్తూనే ఆ వ్యవస్థతో రాజీపడుతూ బతుకులీడ్చే మధ్యతరగతి జీవుల కుహనా అభ్యుదయాన్ని తెగనాడారు. అయితే ఇదంతా వాచ్యంగా చెప్పలేదు. కేవలం ఇతివృత్తానికి ప్రాధాన్యమిచ్చి కథకి అవసరమైన కళాత్మకతని విస్మరించలేదు. కథకి అవసరమైన శైలీ శిల్పం సంవిధానం కృష్ణారావుగారి కథల్లో ఉంది.

ఈ రచయిత కథనరీతికి వ్యంగ్యం ఉపయోగపడింది. అందుకని వీటిని వ్యంగ్య కథలనో, హాస్య కథలనో చెప్పడానికి వీల్లేదు. వీటిలోని వ్యంగ్యం విషాదంతో కూడుకున్నటు వంటింది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల పట్ల వ్యవస్ధ చేస్తున్న క్రూర పరిహాసాన్ని ఈ కథలు చిత్రించాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good