బంగారుకల అనగా సువర్ణస్వప్నం. సువర్ణము అనగా మంచి అక్షరము. జాతిని ప్రబోధించేదే మంచి అక్షరమవుతుంది. పితృభక్తి కన్నా రాజభక్తి గొప్పదని భావించిన విశ్వనాధ నాయకుని కథ, తిరుమలనాయకుని కథ ఇందులో రమణీయంగా, రసవంతంగా వర్ణింపబడ్డాయి. అన్నింటికన్నా రీడబిలిటీ ఎక్కువగా వుంది.
అభిషేక్ - అమృత రెండూ కాల్పనిక పాత్రలు. ఒకరకంగా దృశ్యకావ్యానికి సూత్రధారులవంటివారు. హంపీ విజయనగరంలో అడుగుపెట్టబోతున్నప్పుడు హస్కీవాయిస్తో ఆమె 'అభీ' అని పిలవటంతో నవల మొదలవుతుంది. ఇది జన్మాంతర కథ కాకపోయినా కథన సౌకర్యం, సౌందర్యం కోసం కల్పింపబడ్డ ఒక చమత్కారం.
''ఏ దేవి చిలికెనో ఈ పాలమీగడ
విట్టలాలయ శిలావేదులందు''
అట్టి దివ్యతత్వము విరూపాక్ష విద్యారణ్యుల తపస్సిద్ధి.
రాయలవారిపై లోగడ కొన్ని నవలలు వచ్చాయి. దేని ప్రత్యేకత దానిదే. ఒక్క విషయం గమనించండి. ఇలాంటి మహోన్నత శిల్పం - సాహిత్యం - సంస్కృతి ఎందుకు విధ్వంసమయింది? ఏ పొరపాటువల్ల? దానిని భావి ప్రజలు తెలుసుకోవలసిన అవసరం వుంది. పునరావృత్తం కాకుండా జాగ్రత్తపడవలసి ఉంది.
పేజీలు : 184