చెడ్డ శిష్యుడు

ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడుండేవాడు. అతడి దగ్గర మల్లవిద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తూండేవారు. వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీపట్టు తెలుసు. వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికొకడికి నేర్పాడు. కొన్నాళ్ళ తరువాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరకు పోయి, ''మహారాజా! రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు. ఆఖరికి నాకు విద్య నేర్పిన గురువునైనా సరే ఓడించగలను. కాని, ఆయన ముసలివాడు కావటంవల్లా, నాకు విద్య నేర్పిన వాడవ్వడంవల్లా కృతజ్ఞతకొద్ది ఆయనమీద సవాలు చేయదలచలేదు.'' అన్నాడు.

శిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది. అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతణ్ణి కోప్పడి, ''అయినా, నీ మాటల్లో వున్న నిజం ఎంతో తెలిసిపోతుంది. మీ ఇద్దరికి కుస్తీ ఏర్పాటు చేశాను,'' అన్నాడు.

గురు శిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు. యువకుడూ, బలశాలి అయిన శిష్యుడు ఏనుగుపిల్లలా ముసలి గురువుమీదికి దూకాడు. గురువుకు తను బలంలో శిష్యుడికి తీసికట్టని తెలుసు. అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్కకుస్తీపట్టు ప్రయోగించి అతణ్ణి గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు.

''ఈ పట్టు నువ్వు నాకు నేర్పలేదు ఇది అన్యాయం!'' అన్నాడు శిష్యుడు, పడ్డచోటునుంచి లేచి మన్ను దలుపుకుంటూ.

''ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు.'' అన్నాడు ముసలి గురువు. రాజూ, చూడవచ్చిన ప్రజలూ గురువును మెచ్చుకున్నారు.

పేజీలు : 308

Write a review

Note: HTML is not translated!
Bad           Good