భారతీయ ఆంగ్ల రచయితల్లో అగ్రశ్రేణి రచయితైన ముల్కరాజ్ ఆనంద్ ప్రస్తుత పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో 12-12-1905లో వెండి నగిషీ పనులు చేసే లాలాచంద్ - ఈశ్వరీకౌర్ దంపతులకు పుట్టారు. లా¬ర్, అమృతసర్లలోవిద్యాభ్యాసం చేశాక లండన్ వెళ్ళి కేంబ్రిడ్జి నుండి1928లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లండన్‌లో సుప్రసిద్ధ రచయితలైన టి.ఎస్. ఇలియట్, హెన్రిమిల్లర్, హెర్బర్ రిట్, బి.ఎమ్. బారిష్టర్, హల్డవుస్ హక్స్లీ వంటి వారితో స్నేహాలు, పరిచయాలు ముల్కరాజ్గారిని ఓ రచయితను చేశాయి. చిన్నతనంలో తన తండ్రి బ్రిటీష్ సేనలో సిపాయిగా చేరి పడిన బాధలు, తన 14వ ఏట ప్రత్యక్షంగా చూసిన జెలియన్వాలా బాగ్ మారణ¬మం వీరి మనసులో గాఢంగా ముద్ర వేసుకుంది. వర్ణభేదం వల్ల తక్కువగా చూడబడినవారు పడ్డ కష్టాలు ముల్కరాజ్గారిని బాగా బాధించాయి. విదేశాలలో ఉన్నప్పటికీ, విదేశీ చదువులు, నాగరికత వంటబట్టినప్పటికీ ఆయన ఎక్కువగా మహాత్మాగాంధీ ఆదర్శాలకే స్పందించారు. బాధింపబడినవారి వేదనాభరితమైన జీవితాలను - కన్నీరు పెట్టించగలిగినంతగా రాయగలిగిన సమర్ధవంతమైన రచయిత - ముల్క్‌రాజ్, లండన్‌లోని భారతీయులకోసం వారిలోని హెచ్చుతగ్గులను ఎదిరించి వర్గ, కుల, మతాలకతీతంగా మానవత్వాన్నే మరచి తోటి మానవులపట్ల ఎంత హీనంగా చూస్తున్నదీ, ప్రవర్తిస్తున్నదీ ప్రపంచమంతా తెలుసుకునేటట్లుగా ఇంగ్లీషు రచనలు చేశారు. ఇంగ్లీషు నేలపై ఉంటూ వారివల్ల అణచివేయబడ్డ కార్మికుల కోసం ఇంగ్లీషు వారికి వ్యతిరేకంగా కలమెత్తి, గళమెత్తి పోరాడిన రచయిత ముల్కరాజ్ ఆనంద్ |