అతని కథల్ని పరిశీలనగా చదువుతుంటే, అతనికి గాఢమైన జీవితానుభవం వున్నట్టూ, అతను చాలా ప్రభావాలకు లోనైన మనిషి అనీ అర్థమవుతుంది. అనుభవాలూ, ప్రభావాలూ, అతని వ్యక్తిత్వానికి పదునుపెట్టి, సాహిత్య చైతన్యాన్ని ప్రోదిచేసినట్లు తెలుస్తుంది. అతను కథా లోకానికి సుపరిచితుడైన మంచి రచయిత - రహమతుల్లా!
సమాజాన్నీ, ఆ సమాజంలోని మనుషుల్నీ, ఆ మనుషుల సమస్యల్నీ - చదివే మేథలో, చూసే చూపులో - రహమతుల్లాకి ఒక స్థితప్రజ్ఞ వుంది. ఈ కారణాన రచయితగా అతను అక్షరయోగంలో వున్నప్పుడు ఎక్కడ నిగ్రహం కోల్పోడు. తన కథల్లో ముస్లింల అభద్రతాభావాన్ని ఎంత చిక్కగా పఠిత ముందుంచుతాడో, హిందువుల దోస్తీని కూడా అంతే ఆప్యాయతతో, మధురోహలతో చిత్రించగలిగాడు.
రహమతుల్లా కథల గురించి చెప్తూ ''గుండె తడితో రాసిన కథ్లివి. ముస్లింలంతా చదవాలి. ముస్లింలు ఎలా వున్నారో ఎలా ఆలోచిస్తున్నారో తెలుస్తుంది'' అని విలువైన అభిప్రాయం తెలిపారు ప్రఖ్యాత రచయిత స్మైల్‌. చదవాల్సింది ముస్లింలే కాదు. ముస్లిమేతరులే ముందుగా చదవాలి అంటాను నేను! ముస్లింల గుండెల్లో ఎన్ని తొణకని నిండుకుండలున్నాయో తెలుస్తుంది. అప్పుడే కదా నాణేనికి రెండు వైపులూ అర్థమయ్యేది?!
కథకుడుగా రహమతుల్లాది ఒక అందమైన sharp signature! అందం శిల్పంలో వుంది. Sharpness ఇతివృత్తాల్లో వుంది! అతనికి నిండుగా ఒక దోసెడు అభినందనల చందోలు బొండుమల్లెలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good