ఆత్మ కథాంశాల ఉత్తరాలు - రంగనాయకమ్మ ........... ప్రసిద్ధ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ పుస్తకానికి ముందుమాటలాగ 'నా ఉత్తరాల వెనుక చరిత్ర' శీర్షికన వ్రాసిన పేజీలలోని భాగాలలో కొంత పాఠకుల కోసం ఈ క్రింద పొందుపరుస్తున్నా.

''ఆ మధ్య ఒకరోజు (2012) డిసెంబరులో నాకు కృష్ణాబాయి గారు ఫోన్‌చేసి (వైజాగ్‌ నించి)'' పాత సంచులు సర్దుతోంటే మీరు రాసిన ఉత్తరం ఒకటి దొరికింది. పెద్దదే, మద్రాసు నించి రాసినట్టుంది. నేనూ పద్మినీ చదివి నవ్వుకున్నాం'' అన్నారు.
''నేనెప్పుడు రాశాను మీకు? అది నేను రాసిందై ఉండదు'' అన్నాను నేను.
''మీ సంతకమే ఉంది. ఎప్పుడో నలభై ఏళ్ల కిందట రాసింది 1972''
''అబ్బే, కాదండీ. నేనెప్పుడూ రాయలేదు మీకు. అది నా చేతి రాతేనా?''
''ఏమో, రాత నాకేం గుర్తు? మీ పేరే ఉంది, చదువుతాను, వినండి'' అని ఆ ఉత్తరం అంతా చదివారు ఆవిడ.
అది నేను రాసిందే అని అప్పటికి నమ్మక తప్పలేదు. ''నాకు గుర్తేలేదు. మీరు చదివారు కాబట్టి నమ్మాలి మరి. ఆ ఉత్తరం మీకు అంది. ఆ రోజుల్లో మీరు చదివిన సంగతి మీకు గుర్తుందా?''
''నాకూ గుర్తులేదు. పాత సంచులన్నీ బోర్లించి సర్దుతోంటే ఇది కనపడింది. శిథిలం అయిపోయింది ఇప్పటికే, జిరాక్స్‌ చేయించి పంపిస్తా.''
''ఎందుకూ, దండగ. చదివితే విన్నాగా? గాంధీ కూడా వింటాడు ఒకసారి చదవండి చాలు. తర్వాత చింపెయ్యండి. జిరాక్స్‌ ఖర్చులూ, పోస్టు ఖర్చులూ, వొద్దు.''
''కాదు ఇది మీకు పంపిస్తా రేపు. ఒకసారి మీరే  చదవండి.''
''మీకు రాసిన ఉత్తరం మీదీ, మళ్ళీ నాకెందుకూ? నేనేం చేసుకోనూ?''
''అబ్బ, ఊరుకోండి. చెప్తే వినరు. ఒకసారి చూడరాదూ?''
తర్వాత రెండు రోజుల్లో ఆ ఉత్తరం మాకు అందింది. చదివాం. అదంతా నాచేతిరాతే. చివర్లో సంతకంగా నా పూజ పేరే. ఈ ఆత్మ కథాంశాల ఉత్తరాలు అన్నీ - వివిధ సందర్భాలలో కృష్ణాబాయిగారికి రాసినవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good