రజనీ సుబ్రహ్మణ్యంగారి కథానికలలో కనబడే రచనా సౌలభ్యం వివరించడానికి ఉదాహరణలుగా మాత్రమే ఈ సంకలనంలోని ఒక ఆరు కథానికల గురించిన ఈ క్లుప్తమైన వివరణ. కళ్లు మిరుమిట్లు గొలిపే శైలీ విన్యాసాలు, సుదీర్ఘ సంభాషనలు, అనూహ్యమైన మలుపులు - ఇలాటివి ఏమీ ఉండవు వీరి రచనల్లో. సూటిగా, సరళంగా సాగే కథనం, నిత్య జీవితంలో మనకు తారసపడే పాత్రలు, మనం వినే మాటలు, మన అనుభవాలలోకి వచ్చే సంఘటనలు, అయినా, చదవటం పూర్తి చేసిన తరువాత ప్రతి రచనా ఒక మంచి రచనను చదివామన్న ఆనందాన్నిస్తుంది. అందువల్లే ఉన్నవి పది కథానికలే అయినా అవి అన్నీ నిక్కమైన మంచి నీలములు అనిపిస్తాయి.
రెండవ విభాగంలో మూడు అనువాదాలు ఉన్నాయి. మూడూ ఆంగ్లం నుంచి చేసిన అనువాదాలే. ఒకటి, కాట్రగడ్డ గోపీచంద్ వ్రాసిన కథానిక; మరొకటి పాల్ విలియర్డ్ వ్రాసిన కథానిక; మూడోది కాట్రగడ్డ గోపీచంద్ వ్రాసిన వ్యాసం. ఆ కథానికల సొగసు, ఆ వ్యాసంలో వ్యక్తమయే పరిణతి - ఇవి ఒక ఎత్తయితే, అనువాదాలు అని చెపితేగానీ తెలియనంత సరళంగా ఉన్న అనువాదాలు మరొక ఎత్తు!
ఇక మూడవ విభాగంలో ఏడు వ్యాసాలు ఉన్నాయి. రెండు వ్యాసాలు వారి నాన్నగారు, మహానుభావులు త్రిపురనేని గోపీచంద్ గారి గురించి, గోపీచంద్ గారి సాహిత్యసృష్టి ద్వారా, వారి గురించి వచ్చిన అనేక వ్యాసాల ద్వారా, వారి విశిష్ట వ్యక్తిత్వం గురించి, వారి భావప్రపంచం గురించి చాలామందికి ఎంతో కొంత పరిచయం ఉండే ఉంటుంది. అయినా, ఆ మహామనీషి గురించి ఒక కూతురిగా ఈ రచయిత్రి వ్రాసిన ఈ రెండు వ్యాసాలు, ఒక ఆత్మీయతా సుగంధంతో గుబాళిస్తూ, ఏకబిగువున చదివేలా చేస్తాయి. - కుందుర్తి రజనీకాంత్, బెంగుళూరు
పేజీలు : 120