శ్రీ త్రిపురనేని గోపీచంద్‌ గారు తాము తొలికథ రాసిన (1928) పదేళ్ళకి గాని తొలి నవల రాయలేదు. 'అసమర్థుని జీవయాత్ర' ఆయన రెండో నవల. దీని రచనాకాలం (1945-46). ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యాను బంధాలలో ధారావాహికగా వెలువడింది. ఈ నవలని శ్రీ గోపీచంద్‌ 'ఎందుకు? ఎందుకు?' అనే ప్రశ్న నేర్పినందుకు తమ తండ్రిగారైన (తెలుగునాట పేరుమోసిన హేతువాది, నాస్తికుడు, కులమతాలని చీల్చి చెండాడినవాడు మూఢనమ్మకాలమీద నిర్విరామంగా సంగ్రామం సాగించి పేరెన్నికకన్న) శ్రీ రామస్వామి చౌదరిగారికి అంకితం ఇచ్చారు.

అంతరిస్తున్న జమీందారీ వ్యవస్థ, అప్పుడప్పుడే స్థిరపడుతున్న పెట్టుబడిదారీ వ్యవస్థ - ఈ రెండింటి సంఘర్షణలో ఒక అపురూపమైన సందిగ్ధ మనస్తత్వాన్ని సంతరించుకున్న సీతారామారావు ఇందులోని కథానాయకుడు.

ఈ నవల తెలుగునేలలో మొలకెత్తి మానుగా ఎదిగింది. అప్పటి మన పల్లెటూళ్ళు, మానవ సంబంధాలు ఇందులో మనకి తారసపడతాయి. ఆస్తి, అంతస్థులు తమ వికృతరూపంలో మనకి సాక్షాత్కరిస్తాయి. వీటికి ఈ నవల అద్దం పట్టింది.

జమీందారీ వ్యవస్థ ఎలా బీటలు వారుతుందో, మన సమాజంలో పెట్టుబడిదారీ బీజాలు ఎలా నాటుకుంటున్నాయో వివరించారు శ్రీ గోపీచంద్‌. నవల 'కనీసం ఒక తరం జీవితాన్ని అయినా కళ్ళకు కట్టాలి' అంటారు సాహితీవేత్తలు. ఈ నవల ఈ పని చేసిందనీ, మన జీవితాలని మనకి ఎరుక పరిచిందనీ చెప్పవచ్చు. ఈ పని చేసింది కనుకనే ఈ నవల ఇంకా నిలబడి ఉంది.

ఈ నవలలోని కాథానాయకుడు ధీరలలితుడూ, ధీరోదాత్తుడూ, సకల గుణాభి రాముడూ కాదు. అంతర్ముఖుడు. గోరంతలు కొండంతలు చేస్తాడు. పరిసరాలని పట్టించుకోకుండా ఊహాలోకాలలో తేలిపోతూ ఉంటాడు. ఇతడు ఊహాశాలి. అంతేగాదు, ఉన్మత్తుడు కూడా. దీనికి దాఖలాలు ఈ నవల పొడుగూతా మనకి తారసపడతాయి. అన్నింటికంటే తిరుగులేని సాక్ష్యం అసమర్థుని అంతిమయాత్రే. అది భీభత్సరస ప్రధానం. పిశాచగణ సమవాకారం. మానవ మనుగడలోని కీలక అంశాలని శ్రీ గోపీచంద్‌ చాలా ఒడుపుగా మనకు విశదపరిచారు.

'అసమర్ధుని జీవయాత్ర' తెలుగులో మనో వైజ్ఞానిక నవలగా పేరుపొందింది. సీతారామారావు పాత్ర విచ్చిన్నమౌతున్న వ్యక్తిత్వానికి ప్రతీకగా నిలిచిపోయింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good