మా చిన్నప్పుడు పాటలు విని తల ఊపుతూ ఆనందించడం అందరికీ అలవాటు. ఇప్పటిలాగా పాట మొదలవగానే లేచి గెంతులేసి ఆనందిస్తున్నాం అనుకోవడం ఆ రోజుల్లో రౌడీల లక్షణం. నాకు పాటలు విని ఆనందించే వయస్సు వచ్చిన దగ్గర నుంచీ ఈనాటి వరకూ ఇంకా ఉర్రూతలూగిస్తున్న ఏకైక స్వరం అనసూయగారిదే. మేనమామ దేవులపల్లివారి 'జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి', కొనకళ్ళవారి 'మొక్కజొన్న తోటలో', 'నోమీన మల్లాల', అప్పటికి అముద్రితాలైన నండూరివారి ఎంకి పాటలు, గురజాడవారి ముత్యాల సరాలు, శ్రీశ్రీగారి మహాప్రస్థానం, రాయప్రోలువారి దేశభక్తి గీతాలు... ఒకటేమిటి కొన్ని వేల పాటలకి తొలిసారిగా స్వరాలు కట్టి తన అసమాన స్వరంతో శాస్త్రీయ సంగీత స్థాయిలో పూర్తి కచేరీలు చేసిన తొలి తెలుగు గాయని అసమాన అనసూయ గారే! తెలుగు సంగీత చరిత్రలో ఇప్పుడు లలిత సంగీతం అని పిలవబడుతున్న భావగీతాలకి ఆద్యురాలై, బ్రిటీష్‌వారి రోజులలోనే దేశభక్తి గీతాలని నిర్భయంగా పాడి, అంతవరకూ 'కామెడీ పాటలు' అని పిలవబడుతున్న పాటలకి జానపద గేయాలుగా ప్రచారం చేసి, సభా గౌరవం కలిగించిన తొలి గాయని అసమాన గాయని అనసూయాదేవిగారే! అంతెందుకు, ఈనాడు తెలుగునాట ఏ సినిమాలో కానీ, పాటల కార్యక్రమాలలో కానీ ఎటువంటి జానపద బాణీ వినిపించినా, దాని మూలాలు అనసూయాదేవిగారు దశాబ్దాల పాటు మారుమూల ప్రాంతాలు తిరిగి సేకరించి, బాణీ కట్టి పాడినదే అని నిస్సందేహంగా చెప్పవచ్చును.

ఈ సజీవ జీవనయానం ఒక వ్యక్తి చరిత్ర మాత్రమే కాదు. 90 సంవత్సరాల తెలుగు సంగీత చరిత్ర. అందులో ప్రతీ మలుపులోనూ అనసూయగారు నిర్వహించిన అసమానమైన పాత్రకి దర్పణం. ఆమె వ్యక్తిగత జీవితానుభావాల రంగరింపు. ఆరు తరాల సుదీర్ఘమైన, సుసంపన్నమైన తెలుగు సంగీత, సాహిత్య వ్యక్తిగత జీవితం, ఫోటోలు, ఆమె సేకరించిన ప్రముఖుల ఆటోగ్రాఫులూ అన్నింటినీ, సంగ్రహంగా అనిపించినా సమగ్రంగానే 'అసమాన అనసూయ' అనే ఈ అపురూపమైన, చారిత్రక ప్రచురణలో అందించాం.

- వంగూరి చిట్టెన్‌ రాజు

Pages : 304

Write a review

Note: HTML is not translated!
Bad           Good