మన కళా వైభవ కాంతులు

'కళలు అంతూ దరీ లేని మహాసాగరం వంటివి. ఆ సాగరం అంతు కనుగొనడానికి తుదికంటూ ప్రయత్నించిన వారిలో నేనూ ఒకడిననే సంతృప్తి నాకు చాలు' అంటారు కర్నాటి.

కళా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు కర్నాటి లక్ష్మీనరసయ్య. కళాసాగరంలో విలువైన ముత్యాలను ఏర్చికూర్చి 'కళా వైభవం' అందించారాయన. పుస్తకంలోకి వెళితే మనం గర్వించదగిన కళాప్రపంచంలోకి వెళ్ళినట్లే.

'అడుగో కోదండ పాణి అడుగో' అని పాడుకుంటూ తోలుబొమ్మలాట ముందు కూర్చోవచ్చు. ''అడుగడుగున పద్యములే' అంటూ అవధానాలలోకి తొంగిచూడవచ్చు. 'చేరి వినవే శౌరి చరితము' అని హరికథ వినిపించవచ్చు. అమరావతి శిల్పాలో కళమునకలై పోవచ్చు. ప్రజానాట్యమండలి డప్పుల చప్పుళ్లు వినవచ్చు. కళా పరిషత్తుల నాటకాలతో చెలిమి చేయవచ్చు. ఒకటా రెండా! జానపద వాజ్ఞయం, శ్రామికగేయ సాహిత్యం, నటరత్నాలు, శిల్ప సంపద, నాట్యకళలతోకరువు తీరా కబుర్లు చెప్పుకోవచ్చు.

సమాచారం పొంగి పొర్లే ఈ 'గూగుల్‌' కాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరమని 'కళా వైభవం' మరోసారి నిరూపించింది. ఒకానొక కాలంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించిన కళాకారులు, తరువాత తరాలకు పెద్దగా తెలియకపోవచ్చు. అలాంటి వారి గురించి తెలుసుకునే అపూర్వమైన అవకాశం ఈ పుస్తకం ఇస్తుంది. మొట్ట మొదట పాశ్చాత్య రీతిలో చిత్రరచన చేసిన అంకాల వెంకటసుబ్బారావు గురించి ఏ సెర్చ్‌ ఇంజన్‌ చెప్పగలదు! అందుకే అనడం..ఇది అక్షరాల విలువైన పుస్తకం! - శ్రీకృష్ణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good