రాజకీయాలలో పరిచయం ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా హరిరామ జోగయ్య గారిని ఒక గొప్ప రాజకీయ విశ్లేషకుడిగా గుర్తిస్తారు. ఆయన చెప్పే విశ్లేషణలో నిబద్ధత ఉంటుంది. విజ్ఞత ఉంటుంది. జనం నాడి ఉంటుంది. అందుకే 60 సంవత్సరాలుగా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా కొనసాగగలిగారు. బహుశా ప్రస్తుత రాజకీయ నాయకుల్లో ఇంత అనుభవం, ఇన్ని పదవులు పొందిన వారు మరొకరు లేరనుకుంటాను. ఆయన కొన్ని సందర్భాలలో పార్టీలు మారారు. కానీ మారిన ప్రతిసారీ ఆయన వాదంలో నిజాయితీ ఉంది. - దాసరి నారాయణరావు

    తన సుదీర్ఘ రాజకీయ అనుభవాలను క్రోఢీకరించి ''అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం'' పేరుతో జోగయ్యగారు పుస్తకాన్ని వ్రాయడం సంతోషకరం. ఈ పుస్తకంలో తన వ్యక్తిగత, రాజకీయ పంథాను నిక్కచ్ఛిగా వివరించారు. అలాగే రాష్ట్రంలో సంభవించిన పలు రాజకీయ పరిణామాలలో తన పాత్ర గురించి స్పష్టంగా విశదీకరించారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై తన అవగాహనను, రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలపై తనకున్న అంచనాలనూ తన పుస్తకంలో ఆయన వెల్లడించారు. రాష్ట్ర రాజకీయాలను అధ్యయనం చేసేవారికి ఈ పుస్తకం ఎంతో దోహదపడగలదని నా అభిప్రాయం. - ఆర్‌.సత్యనారాయణరాజు

    నాలుగైదు పార్టీలు మారారన్న విమర్శకు మైనెస్‌ లేదా ప్లస్‌ ఏమనుకున్నా, ప్రజలు ఏమంటారో అటు వైపు ఉంటాననటం వారి సమాధానం. కానీ నేను పరిశీలించిన మేరకు రాజకీయపరంగా ఎత్తులు కొన్ని ఉండవచ్చునేమో గానీ తాను అనుకున్న సిద్ధాంతం కోసం తేడా వస్తే ఏ నాయకుడినీ, పార్టీనీ, పదవినీ లెక్క చేయని మనస్తత్వం వారికి మెండుగా ఉంది. - చలసాని శ్రీనివాస్‌

    నేటి రాజకీయమే రేపటి చరిత్ర. పాత్రికేయులు ఎప్పటికప్పుడు ఈ చరిత్ర రచన చేస్తూనే వుంటారు. కానీ పాత్రధారులే ఆ పని చేస్తే...? ఆ రచన వేరు. యుద్ధం చూసిన వాడి రచనకి, యుద్ధం చేసిన వాడి రచనకీ తేడా వుంటుంది. దేని ప్రత్యేకతలు దానివి. సినిమా భాషలో చెప్పాలంటే, లాంగ్‌ షాట్‌కి, క్లోజప్‌కీ వున్న తేడా. కానీ ఒక దృశ్యం పరిపూర్ణం కావాలంటే రెండూ వుండాలి. కాబట్టి మన చరిత్రను మనం తెలుసుకోవాలంటే పాత్రధారులు కూడా రాయాల్సిందే.

    ఆయన కళ్ళముందే ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావము, విభజనా జరిగిపోయాయి. స్థానిక స్వపరిపాలనలో సమితులు సమసి పోయి, మండలాలు ఊపిరి పోసుకున్నాయి. ఎన్నో పెనుమార్పుల్లో పాత్రధారిగాను, సాక్షిగానూ నిలిచారు. ఆయన చుట్టూ వున్న రాజకీయాల్లోని ప్రశ్నలకే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల చుట్టూ వున్న రాజకీయాల్లోని సందేహాలకూ ఆయన వద్ద సమాధానాలు, వివరణలూ దొరికే అవకాశం వుంది. కాబట్టి ఆయన ఈ గ్రంథ రచన చేయడం రాజకీయ విద్యార్థులకు, ఇప్పటి రాజకీయ నాయకులకు, పరిశోధకులకు, పాత్రికేయులకూ ఉపయోగకరంగా వుంటుందని భావిస్తాను. - సతీష్‌ చందర్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good