ఒకానొక అందగాడు, ఒక మహారణ్యంలో గుఱ్ఱం మీద శరవేగంతో పోతున్నాడు. పోగా పోగా, కొన్ని లతలు, పొదలు అడ్డమొచ్చాయి. గుఱ్ఱం ముందుకు సాగేందుకు వీలులేకపోయింది. నుఱగలు గక్కుకుంటూ ఆగిపోయింది. గుఱ్ఱంమీది యువకుడు కిందకు దిగాడు. ఒరలోనించి కత్తి దూశాడు. అడ్డొచ్చిన లతలు, పొదలు తెగ నరికాడు. దారి చేశాడు. తిరిగి గుఱ్ఱంమీది కెగిరి కూర్చుని పరుగెత్తించాడు. మరి కొంతదూరం సాగాడు.

''అన్నా! అన్నా!'' యెవరో పిలవడం వినిపించింది. మనిషి సంచారంలేని ఆ మహారణ్యంలో తన్నెవరా అంత ఆప్యాయంగా పిలుస్తున్నారని తెల్లబోయాడు. గుఱ్ఱాన్ని నిలిపాడు. నలుదిక్కులూ పరకాయించాడు. ఒక గున్నమామిడి మీది రామచిలుక మాత్రం కనుపించింది. అదే - ''అన్నా అన్నా!'' ముద్దుగా మళ్ళీ పిలిచంది. గుఱ్ణంమీది యువకుడు యెంతో మురిసిపోయాడు. తన గుఱ్ఱాన్ని అటు పోనిచ్చాడు. తీరా చిలకవున్న గున్నమామిడి చెట్టు సమీపించేటప్పటికి, ఆ చిలక కాస్తా అక్కడనుంచి తుర్రుమన్నది. 'కొంటె చిలకా! నిన్ను ఒదిలిపెడతానేమో చూడు' అంటూ ఆ యువకుడు చిలక యెగిరి వెళ్ళిన దెసకు తన గుఱ్ఱమును దౌడు తీయించాడు. పోగా, పోగా, ఒక పర్ణశాల మాత్రమే కనుపించింది. చిలక కనుపించలేదు.

పర్ణశాల ముందు మధ్యవయసులోవున్న యెవరో ఒక స్త్రీ కళ్లుమూసుకుని తీవ్రంగా తపస్సు చేసుకుంటూ కనుపించింది. పలకరించి తపోభంగం చేయడానికి భయపడ్డాడు. గుఱ్ఱాన్ని దిగి అక్కడే పట్టుదలగా కాచుకుని వున్నాడు....

పేజీలు : 55

Write a review

Note: HTML is not translated!
Bad           Good