రామదాసు అంటే భద్రాచలం; భద్రాచలం అంటే రామదాసు కదా! అందుకని ముందు భద్రాచలం కథ చెబుతాను. చర్వితచరణమని నాకూ తెలుసు. కొద్దిగా ఓపిక చెయ్యండి, దయచేసి.
శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో మార్గాయాసం మాన్పుకోవటానికి దోవ పక్కనున్న విశాలమైన శిలాతలంపై విశ్రమించాడు, సీతమ్మవారితోను, లక్ష్మణస్వామితోను. ఆ సంతోషంలో ''మాకు మార్గాయాసం తీర్చి సంతుష్టిని కలిగించిన ఓ పాషాణమా! మరుజన్మమున పర్వతరాజపుత్రుడవై జన్మించి మాకు అత్యంత భక్తుడవు కాగలవు'' అని ఆ రాతికి వరమిచ్చాడు రాముడు.
అప్పుడు ఆ శిల ''స్వామీ! నాపై నీవు ఎప్పుడూ అధివసించి ఉండు''మని కోరింది. కాలాంతరంలో అది జరుగగలదని స్వామి సెలవిచ్చి సతీసోదరులతో ముందుకు సాగిపోయాడు.
పర్వతాలకు ప్రభువు మేరువు. ఆయన భార్య మేనకాదేవి. భార్యాభర్తలిరువురు పుత్రసంతానకాంక్షాపరులై బ్రహ్మదేవుని గురించి ఘోరతపస్సు చేశారు. తపానికి మెచ్చి తాత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శ్రీరామ సేవాపరాయణుడైన కొడుకు కలగాలని కొండలదొర కోరుకొన్నాడు. ఆ వరప్రభావం వలన పర్వతరాజదంపతులకు కలిగిన కుమారుడే భద్రుడు.
సీతాపహరణం జరిగింది. సుగ్రీవునితో స్నేహం కుదిరింది. సీతజాడ తెలిసింది. రాయబారం విఫలమయ్యింది. రావణ సంహారంతో సంగ్రామం ముగిసింది. రామ పట్టాభిషేకం, సీతాపరిత్యాగం, కుశలవ జననం, తండ్రీకొడుకుల సమాగమం, అవతార పరిసమాప్తితో రామాయణకథ సుసంపన్నమయ్యింది.