టాల్‌స్టాయ్‌ ప్రపంచ సాహిత్యంలో ప్రముఖుడు. నవలాకారుడుగా, నాటకకర్తగా, కథకుడుగా, తత్త్వచింతకుడుగా ఆయన చేసిన రచనలు వివిధ భాషలలోనూ విశిష్టత నందుకొన్నవి.
ఆయన పుట్టినది భూస్వామి కుటుంబమైనా, జీవితంలో మానవకోటి పడుతున్న ఇడుముల నర్ధంచేసుకొని, విలాసపరత విదిలించి వేసుకొని బయటపడిన గొప్పవాడు ఆయన.
లోకంలోని బాధలను చూచి, వీనిని తొలగించే సాధనమేమిటని వెతచెందిన భూతదయాపరుడు కాబట్టి ఆయన రచనల్లో ఏదో బాధితుల గుండె గుసగుస వినిపిస్తుంది. వారి నిట్టూర్పు ఉస్సురుసురుమంటుంది. వారి కన్నీరు గిరగిర తిరుగుతుంది.
తాను లోకంలో గడించిన అనుభవాలను, తన హృదయంలో కలత రేపిన సంఘటనలను పాఠకులకు కళ్ళకు కట్టినట్లు తెలియచేయగలిగిన కళాకారుడాయన. కాబట్టి మనమేదో పుస్తకం చదువుతున్నట్టుగా కాక మనమొక ప్రత్యేక పరిస్థితులలో బతుకుతున్నట్టుగా, ఆ పాత్రలతో మంతనాలాడుతున్నట్టుగా భావిస్తాము.
ఆయన రచనలకు వస్తువు జీవితమే. అందులోనూ ఏదో ఒక సంఘటన, ఏదో ఒక కుటుంబం, ఏదో ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని, మనలోనూతన జాగృతిని, నగ్నసత్య పరిశీలనను మేల్కొల్పుతాడు. అంతటితో ఆగక ఈ భూలోక నరకాన్ని స్వర్గంగా కాకున్నా, భూమిగా చేసుకునేందుకైనా మనలో ఒక కార్య పరతంత్రను రూపేందుకు శతథా ప్రయత్నిస్తాడు.
ఈయన టూలా (రష్యా)లోని యాన్నయా పొల్యానాలో 1828లో పుట్టాడు. భూస్వామి కుటుంబం. సైన్యంలో పని చేశాడు. రైతులే భూస్వాముల దగ్గర బానిసలుగానున్న రోజులు మొదలు, వారు విముక్తులైన తర్వాత వరకు వారి మనస్తత్వాన్ని బాగా అర్ధం చేసుకున్నాడు.
అన్నా కరేనినాలోని పాత్రలలో ఆయన సజీవులైన వారినెందరినో రూపొందించాడు. అన్నా కరేనినాలోని పనిమనిషి అగాస్యా అసలు పేరుతో జీవించిన వ్యక్తేనట.
ఈ నవల పత్రికలలో ప్రచురితమవుతుండగా మాస్కోలోని మహిళలు ఏరోజు కారోజు పత్రిక ముద్రణాలయానికి మనుషులను పంపి, తర్వాతి కథేమిటో తెలుసుకుంటూ వచ్చేందుకు నానా శ్రమ పడేవారట. అంతగా ఆకర్షించిన ప్రముఖ నవల ఇది.
ఉత్తమ కళాఖండంగా పరమోచ్ఛస్థితి నందుకున్న అన్నా కరేనినా నవలను తెలుగులో అనువాదం చేసినది శ్రీ తాపీ ధర్మారావు గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good