ఎవరీ అమ్మ?
సృష్టికి మూలమైన దివ్యమాతృప్రేమ మూర్తీభవించి కరచరణాది అవయవములతో ''అమ్మ''గా జిల్లెళ్ళమూడిలో అవతరించింది.
అమ్మను ''అమ్మా'' అని పిలవటంలో ఒక దివ్యానుభూతి కలుగుతుంది. సామాన్య మానవులే కాదు, సాధుపుంగవులు, సన్యాసులు సహితం ''అమ్మా! అనే పిలుపులోని కమ్మదనాన్ని అనుభవించారు. అమ్మ పలకఱింపులోని ప్రేమామృతాన్ని ఆస్వాదించారు. ఆ ప్రేమమూర్తి పాలనలో పరవశించారు. ఎందరో మేధావులు, ఆస్థికులు, నాస్థికులు, శాస్త్రజ్ఞులు, రాజకీయవేత్తలు, విదేశీ యాత్రికులు తమతమ పదవులను మరచిపోయి అమ్మ చల్లని ఒడిలో సేదదీరినవారే. వారందరికీ అమ్మలో దివ్య మాతృప్రేమే గోచరించింది.
అమ్మలో ప్రకటితమయ్యే మాతృత్వం మానవులకే పరిమితం కాదు. ఈ సృష్టిలో గల సకల జీవరాశులు అమ్మ ప్రేమను పొంది ఆనందించిన ధన్యజీవులే! అమ్మ సకల జీవకోటిని ప్రేమించటంలో ఆశ్చర్యం లేదు. అమ్మది సహజ ప్రేమ. అవ్యాజకరుణ. అమ్మప్రేమకు ఆనకట్టలు లేవు. అమ్మ దృష్టికి అడ్డుగోడలు లేవు.
పశుపక్ష్యాదులు సహితం అమ్మలోని దైవత్వాన్ని గుర్తించి, అమ్మను విడిచి వుండలేక అమ్మ సామీప్యాన్ని కోరుకోవటం, అమ్మ ప్రేమకోసం ఆరాటపడటం, హద్దులు లేని అమ్మ ప్రేమకు నిదర్శనం.
అమ్మ అంటే జిల్లెళ్ళమూడిలో నాలుగు గోడల మధ్య కూచున్న 'అమ్మ' అనేకాదు. దేనికైతే ఆది, అంతము లేదో, ఏది సర్వానికీ ఆధారమో అదే అమ్మ....
- టి.టి.అప్పారావు (మాజీ వైస్ ప్రెసిడెంట్, ఓరియంటల్ కాలేజి, జిల్లెళ్ళమూడి)