అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు. రాత్రివేళల్లో దీపాలార్పమని సి.ఆర్‌.పి. వారు చీకటి పడ్డాక రోడ్డు మీద నుంచి కేకలు వేసేవారు. జపాన్‌ విమానాలు వచ్చే సూచనలుంటే - డేంజర్‌ సైరన్‌ మ్రోగేది. ఎంత రాత్రయినా - ఆ శబ్ధం వినగానే మా నాయనమ్మా, మా అమ్మా - అంతా మేడ మీంచి పరుగున వెళ్ళి కింద ఉన్న బొగ్గుల కొట్టంలో తలదాచుకొనేవాళ్ళం. మా అమ్మ నా చెవుల్లో దూది కూరేది. కాస్సేపటికి - మళ్ళీ సైరన్‌ వినిపించాక బయటికి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లోనే హార్బరులో బాంబులు పడ్డాయి. మా నాన్నగారు నన్ను ఎత్తుకు తీసుకువెళ్ళి చూపించారు. ఒక్కొక్కప్పుడు పగలే సైరన్లు వినిపించేవి. చాలామంది వూరు వదిలి వెళ్ళిపోయారు. విశాఖపట్నం రోడ్లు నిర్మానుష్యంగా ఉండేవి. ఆ దృశ్యాన్ని ఇప్పటి ప్రజలు ఊహించలేరనుకొంటాను.
***
గత 56 సంవత్సరాలలో అన్ని ప్రసార, ప్రచార మాధ్యమాలలో - పత్రిక, రేడియో, టెలివిజన్‌, సినిమా, వేదిక - యిన్నింటిలో తలమునకలయిన వాడిగా - మూడు తరాల ప్రముఖులతో భుజాలు రాసుకొని పనిచేసినవాడిగా - నేను కన్నవీ, విన్నవీ, తెలుసుకొన్నవీ, తెలుసుకోవాలనుకున్నవీ, చేసినవీ, చేయాలనుకున్నవీ - నిజాయితీతో మీ ముందుంచితే - ఆ పేజీలలోంచి ఓ మిత్రుడో, హితుడో, జిజ్ఞాసో, అదృష్టవంతుడో, అభాగ్యుడో రూపుదిద్దుకుంటాడు - ఆ రూపం పేరు గొల్లపూడి మారుతిరావు.
అతని కథ - అమ్మ కడుపు చల్లగా.
***
నా చిన్నతనంలో మూడు గొప్ప జ్ఞాపకాలు. 1947 (అప్పటికి నాకు ఎనిమిదేళ్ళు)లో ఈ దేశానికి స్వాతంత్య్రం రావడం. ఊరంతా అపూర్వమైన సందడి. ఆ ఆనందోత్సహాల వెనుకనున్న త్యాగసంపద, దేశభక్తి అర్ధమయే వయస్సు కాదు. 1948లో మహాత్మాగాంధీ పోయిన రోజు విశాఖపట్నం బీచిలో మా అమ్మగారు, నాన్నగారితో కలిసి స్నానాలు చెయ్యడం గుర్తు. ఆనాటి విషాదం మనస్సు లోతుల్లోకి తాకే విషాదం కాదు. కాని వయస్సు గడుస్తున్న కొద్దీ, ఈ దేశంలో దేశభక్తి కొరవడుతున్న కొద్దీ ఆ రోజు దేశం ఎంత నష్టపోయిందీ అర్ధమవుతుంటుంది. మహాత్ముడు ఆనాటి తరాన్నీ ఎంతగా ప్రభావితం చేసిందీ అర్ధమవుతూంటుంది. మరొక జ్ఞాపకం - 1948లోనే విశాఖపట్నం ఈ ఒడ్డునుంచి జవహర్‌లాల్‌ నెహ్రు గారు మొదటి భారత నౌక 'జల ఉష'ని సముద్రంలోకి పంపడం. అది దేశం గర్వపడే గొప్ప విజయమని ఆనాడు నాకు తెలీదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good