సాహిత్య శిల్పంగా ప్రసిద్ధిగాంచిన 'అంబేద్కర్ ఆత్మకథ' 1956 డిసెంబర్ 6న అంబేద్కర్ మరణానంతరం - దాదర్‌లో వున్న ఆయన 'రాజగృహ' ఇంట్లోని రాతప్రతులలో 'వెయింటింగ్ ఫర్ ఎ వీసా' అనే శీర్షికతో మొదటిసారిగా బయటపడింది. అంతకు ముందు అంటే అంబేద్కర్ జీవితకాలంలో 'అంబేద్కర్ ఆత్మకథ' ఎక్కడా అచ్చుకాలేదు.
'అంబేద్కర్ ఆత్మకథ' ప్రపంచంలో అత్యున్నత సాహిత్యకారుల 'వర్క్ ఆఫ్ ఆర్ట్'తో సరితూగే మేలిమి రచన. అంబేద్కర్ ఆత్మకథ భారతదేశం ఆత్మకథ! అంబేద్కర్ స్వదస్తూరీతో ఇంగ్లీష్‌లో రాసిన 'వెయింటింగ్ ఫర్ ఎ వీసా'కు తెలుగులో 'ప్రవేశ అర్హతకై నిరీక్షణ' లేదా 'పడిగాపుల పొలిమేర' అని అర్థం. ఇంగ్లీష్‌లో 'వీసా' అంటే సామాన్యార్థం - ప్రవేశ అర్హతకు సంబంధించి పరాయి దేశం యిచ్చే అనుమతి. మాదిగ గూడెం నుంచీ మాలపల్లి నుంచీ విముక్తి చెంది ఊళ్ళోకి వెళ్ళడానికి ప్రవేశ అర్హత లేని స్థితిలో అంటరాని జాతి ప్రజలు పొలిమేరలో పడిగాపులు పడే అవస్థనే 'వెయింటింగ్ ఫర్ ఎ వీసా' అని అంబేద్కర్ విశేషార్థంలో ప్రయోగించారు.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో యే యూనివర్శిటీలో అయితే అంబేద్కర్ చదివారో అదే న్యూయార్క్ కొలంబియా యూనివర్శిటీలో నేడు ఈ 'అంబేద్కర్ ఆటోబయోగ్రఫీ' పాఠ్యగ్రంథంగా వుంది.