అల్లం శేషగిరిరావు కథలు :

వేట కథలకు పెట్టింది పేరు అల్లం శేషగిరిరావు. ఈ కథల్ని వారు సరదాకోసమో, సంతోషం కోసమో రాయలేదు. బాధతోనూ, భయంతోనూ, బాధ్యతతోనూ రాశారు. ప్రపంచమంతటా మంచులా పేరుకుపోయిన అన్యాయాన్ని గుప్పిళ్ళతో తీసి చూపించారు. ఆందోళన చెందారు. ఆందోళన చెందటంతోనూ, గుప్పిళ్ళకొద్ది అన్యాయాన్ని చూపించడంతోనూ సమస్యకు పరిష్కారం లభించదంటే ఏంచెయ్యాలో ఈ కథలు చదివి మీరే తెల్చుకోండి.

ఒక జంతువుని మరొక జంతువు వేటాడటం, దాన్ని చంపి తినడం మృగధర్మం. తప్పులేదు. అదే ఒక మనిషిని మరొక మనిషి వేటాడటం, లేదంటే అతన్ని దోచెయ్యడం ఇదెక్కడి ధర్మ? తప్పుకాదా ఇది? అని ఆకోశిస్తున్న శేషగిరిరావు కథలు చదివి మీరూ వారితో కన్నీరు మున్నీరవుతారా? లేదూ, కన్నీళ్ళను కత్తులు చేసి దూస్తారా అన్నది మీయిష్టం. మీ ఇష్టాఇష్టాల కోసమే, మీ న్యాయాన్యాయాలకోసమే ఈ కథలు. మిమ్మల్ని మీరు బేరీజు వేసుకునేందుకు ఇంతకన్నా మంచి పుస్తకం లేదు.

ఈ కథలు తెలుగు కథా సాహిత్యానికి కొత్త వెలుగులు. సరికొత్త సొబగులు. శబ్దాలను ఆకర్షీకరించడం, నిశ్వబ్దాన్ని దృశ్యీకరించటం అల్లం వారికి తెలిసినట్లుగా మరొకరికి తెలియదు. కళ్ళకు బొమ్మ కట్టించే కథనశైలి, గుండెల్ని  పిండేసే సంభాషణలు శేషగిరిరావుకే చెల్లు. విలక్షణ కథకుడు అల్లం శేషగిరిరావు. అతని దారి, రాదారి వేరు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good