శ్రీ అల్లం రాజయ్య గారి నవలలను పరిచయం చేయడమంటే తెలుగు సమాజం... ఇంకా నిర్దిష్టంగా చెప్పాలంటే.. తెలంగాణ చరిత్రను చెప్పడమే. ఇది గత మూడు నాలుగు దశాబ్దాల చరిత్రయే కాక రాబోయే కాలపు భవిష్యత్‌ చరిత్ర కూడా. గతాన్ని చదవడమంటే భవిష్యత్‌ను సందర్శించడమే.

ఈ రచనల్లో చరిత్ర, సాహిత్యం ఒకదానితో ఒకటి ముడిపడి ముందుకు సాగాయి. ఈ నవలలు సృజనాత్మక సాహిత్యమే కాక, చారిత్రక నవలలు కూడా. ఒక నిర్దిష్ట సామాజిక పునాది మీద నిలబడి సామాజిక పరిణామ వాస్తవాలను, చారిత్రక సంబంధాలను సూటిగా చెప్పే తీవ్ర కృషే ఈ నవలల్లో ఉంది. ఈ సంక్లిష్టతలో ఉండే భౌతిక పరిమితులను, ఆ పరిమితులను అధిగమించడానికి ఘర్షించి సమాజాన్ని ముందుకు తీసుకుపోతున్న మానవ చైతన్యాన్ని ఈ నవలలు వ్యక్తీకరించడానికి సహజ ప్రయత్నం చేశాయి. నడుస్తున్న చరిత్ర గమనాన్ని, దాని చలన సూత్రాలను పట్టేందుకు రాజయ్య గారు చేసిన అద్భుత సృష్టే ఈ నవలలు.

ప్రస్తుత సమాజ గర్భంలో భవిష్యత్తు ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎలాంటి ప్రసవవేదనలను భరించిందో ఈ నవలలు స్పృశించాయి. కాబట్టి భవిష్యత్తు తన గతాన్ని చూసుకోవడానికి దీపస్థంభాలుగా పనిచేస్తాయి.

చరిత్రలో స్పార్టకస్‌ కాలం నుంచి ఇప్పటివరకూ ప్రజలు ఎప్పుడూ తమకు తాముగా హింసకు పూనుకోలేదు. దోపిడీ, అణచివేత, హింసలను సహించి ప్రాణాలు కూడా అర్పించి, ఇంక దుర్భరమైన స్థితిలోగానీ ప్రతిఘటనకు పూనుకోలేదు. ఎదురుదాడి, ప్రతి హింసలను ప్రజలు పోరాటపు అనివార్య దశలలో మాత్రమే అమలు చేశారు.

శ్రీ అల్లం రాజయ్య ఈ కల్లోల నక్సల్‌బరీ దశాబ్దాలకు సాక్షి, సహచరుడు, టైమ్‌కీపర్‌. నిర్మాణమౌతున్న ప్రజల చరిత్రనే కాకుండా రక్తమాంసాలున్న మానవ సంబంధాలుగా, సాహిత్యంగా శ్రీ రాజయ్య రచించిన నవలలే కొలిమంటుకున్నది, ఊరు, అగ్నికణం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good