ప్రజా ప్రతిఘటనోద్యమాలతో ఎదిగిన అల్లం రాజయ్య యిప్పటిదాకా ఎనిమిది నవలలూ, వందదాకా కథలూ, కవితలూ, పాటలూ, వ్యాసాలు, నాటకాలు రాశారు. ఆయన కథలనిండా వుత్తర తెలంగాణా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి పేద రైతులు, రైతు కూలీలు, వాళ్ళను జలగల్లా పీల్చుకునే భూస్వాములు, కాంట్రాక్టర్లు, వాళ్ళ సేవలో తరించే పోలీసులు, యితర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వాలను నడిపించే రాజకీయ బ్రోకర్లు, చివరికి దుర్భర జీవితాన్ని, దోపిడీని భరించలేక నిస్సహాయంగా, అనివార్యంగా అన్నలతో చేరి తమ జీవితాలకు వెలుగు బాటలు వేసుకోవాలని తపించే పీడితులు కనిపిస్తారు.

రాజయ్య కథలు వూహల్లోంచి పుట్టలేదు. అవి ఫాంటసీలు కావు. ప్రతి కథ వెనకా ఒక నిర్ధిష్ట సంఘటన వుంది. అందువల్లనే వీటిలో అనూహ్యమైన మలుపులు, మెలకువలు వుండవు. పాఠకుల్ని వుద్వేగభరితం చేసే ప్రయత్నం చెయ్యడీరచయిత. చాలాసార్లు వ్యక్తిగత విషాదమైనా అది సామాజిక విషాదంలో భాగమైనట్టుగానే అర్ధమవుతుంది. రాజయ్య పాత్రలు వ్యక్తులు కాదు. దళిత, పీడిత వర్గాలకు ప్రతినిధులు.

రాజయ్య కథల్ని మరెవరి కథల్తోనూ పోల్చలేం. వాటిని చదివి కేవలం ఆనందించాలో, ఆలోచించాలో ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి. దళిత, పీడిత, రైతాంగ, శ్రామిక విముక్తి కోసం కలాన్ని ఆయుధంగా చేసి రాస్తున్న రచయిత అల్లం రాజయ్య. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good