బహుజనులంతా మెలుకువతో ఉండి బహుజన రాజ్యాధికారం దిశగా పయనించాలనే అంత:సూత్రాన్నే ఈ కథలు ప్రబోదిస్తున్నాయి. ముస్లింల పట్ల ఉండే తిరోగమన దృష్టికోణాన్ని బద్ధలు కొడుతున్నాయి. బ్రాహ్మణిజం ఎన్ని కుట్రలు చేసినా, చెరగని మా పేగుబంధానికి మచ్చుతునకలు ఈ కథలు.. కబాబుల తోరణాలు. బహుజన బిడ్డలకు సోయి నేర్పుతున్న గోరుకొయ్యల పొద్దులు. పెత్తనం చేస్తున్న కులం జాడలను కుల్లంకుల్ల చేస్తున్న బహుజన రాజకీయ దరువులు. ఇవి మా మూలవాసీ కథలు..వ్యథలు... - డా.పసునూరి రవీందర్‌

ఈ కథల ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు స్కైబాబ.. ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు. భారతీయ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. ఆ లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు. - డా.ఖాజా

అలాయిబలాయి లోని కథల్లో ఒక భిన్నమైన బహుజన కోణాన్ని రికార్డు చేసిండు స్కై. తద్వారా జరగాల్సిన అసలైన చర్చకు తావు కల్పించిండు, అందుకు తనదైన..ఆత్మీయమైన ముద్ర ఉన్న భాషనీ, అదీ తేనెలూరే తెలంగాణా భాషనీ ఎంచుకున్నాడు. ఆర్ద్రమైన జీవితాల్ని చిత్రిక కట్టిండు. అవి కళ్ళ ముందు నిలబడి మనతో కలిసి నడుస్తాయి. చాఆలసార్లు మనల్ని నిలబెడతాయి. కొన్నిసార్లు దోషిగా..కొన్నిసార్లు అందనంత ఎత్తులో...! అందుకే ఇవి బహుజన కథలు మాత్రమే కావు.. స్కైబాబ కార్యాచరణకు నిదర్శనాలు... - సంగిశెట్టి శ్రీనివాస్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good